గుంటూరు జిల్లా క‌లెక్ట‌రుకు క‌రోనా

చిన్నా పెద్దా.. రాజు పేద తేడా ఏమీ లేకుండా అంద‌రినీ అంటుకుంటూ పోతోంది క‌రోనా. ఎన్ని జాగ్ర‌త్తలు తీసుకున్నా.. ఏ స్థాయిలో ఉన్నా.. క‌రోనా మిన‌హాయింపులేమీ ఇవ్వ‌ట్లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. ఫిలిం సెల‌బ్రెటీలు.. ఇలా చాలామంది ప్ర‌ముఖుల్ని క‌రోనా ప‌ల‌క‌రించింది. తాజాగా ఏపీలో ఓ క‌లెక్ట‌రు సైతం క‌రోనా బారిన ప‌డ్డారు. ఆయ‌న పేరు.. శామ్యూల్ ఆనంద్ కుమార్. గుంటూరు జిల్లా క‌లెక్ట‌రుగా కోవిడ్ నియంత్ర‌ణ కోసం క‌ష్ట‌ప‌డుతున్న ఆయ‌న‌కు కూడా వైర‌స్ సోకింది. క‌రోనా ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ రావ‌డం, ల‌క్ష‌ణాలు మ‌రీ తీవ్రంగా ఏమీ లేక‌పోవ‌డంతో క‌లెక్ట‌రు హోం క్వారంటైన్‌కు వెళ్లారు. క‌లెక్ట‌ర్ ఛాంబ‌ర్‌ను తాత్కాలికంగా మూసివేశారు.

క‌రోనా నియంత్ర‌ణ‌లో చాలా కీలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న అధికారే క‌రోనా బారిన ప‌డ‌టం జిల్లాలో వైర‌స్ తీవ్ర‌త‌ను తెలియ‌జేస్తోంది. జిల్లాలో ఇంకా చాలామంది ప్ర‌భుత్వ అధికారులు, సిబ్బందికి క‌రోనా సోకింది. జాయింట్ కలెక్టర్, డీఆర్డీఏపీడీలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే జిల్లా వైద్య శాఖ అధికారి, పలువురు జిల్లా అధికారులకు , ప్రభుత్వ ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో వాళ్లు కూడా హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. గురువారం గుంటూరు జిల్లాలో 577 కొత్త కేసులు వెలుగు చూడ‌గా.. మొత్తం కేసుల సంఖ్య 6 వేలు దాటిపోయింది. ఇప్ప‌టిదాకా జిల్లాలో కోవిడ్ కారణంగా 63 మంది ప్రాణాలు వ‌దిలారు. మంగ‌ళ‌వారం కూడా అయిదుగురు క‌రోనాతో మ‌ర‌ణించ‌డం గ‌మ‌నార్హం. గ‌త ప‌ది రోజుల్లోనే జిల్లాలో 4 వేల దాకా కేసులు వెలుగుచూశాయి.