ఏపీలో ఇపుడు రఘురామరాజు మోస్ట్ వాంటెడ్ పొలిటీషియన్, మోస్ట్ పాపులర్ పొలిటీషియన్. ఆయన అప్ డేట్ గురించి అటు జనం, ఇటు మీడియా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. దానికి తగినట్టే ఆయన అంతే ఆసక్తికరంగా స్పందిస్తూ తన క్రేజును లైవ్ గా ఉంచుతున్నారు. ఈ ఉదయం తన భద్రత గురించి రాష్ట్రపతిని కలుస్తానని చెప్పిన రఘురామరాజు కలిశాక అమరావతిపై ప్రత్యేక వినతి పత్రం ఇవ్వడం సంచలనం అయ్యింది. అంతకుమించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే… వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ఆయన స్పందించారు.
ఇటీవలే సీబీఐ విచారణ మొదలైన ఈ హత్య గురించి ఏపీలో మరోసారి చర్చ జరుగుతోంది. దీనిపై స్పందించిన రఘురామరాజు త్వరలో వైఎస్ వివేకానందరెడ్డి హంతకులు ఎవరో తెలుస్తుందని, వారికి శిక్ష కూడా పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వ్యవహారంపై ఆయన స్పందించడం ఆశ్చర్యమే. ఎందుకంటే ఇంతవరకు ప్రభుత్వ తప్పటడుగులు గురించే మాట్లాడుతూ వస్తున్న రఘురామరాజు తాజాగా పార్టీ వారు ఇబ్బంది పడుతున్న ఈ విషయం గురించి స్పందించడం గమనార్హం.
ఇదిలా ఉండగా… 2019 ఏడాది మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఆయన ఇంట్లోని బాత్రూమ్ లో ఆయనను గొడ్డలితో నరికి చంపారు. సాక్ష్యాలు తారుమారు చేసేందుకు జగన్ కుటుంబం ప్రయత్నించిందని టీడీపీ ఆరోపించగా, టీడీపీ నేతలే హత్య వెనుక ఉన్నారని అపుడు సీబీఐ దర్యాప్తును కోరింది వైసీపీ. హైకోర్టులో సీబీఐ దర్యాప్తు కోసం పిటిషన్ వేసిన జగన్ అనంతరం ఉపసంహరించుకున్నారు. అయితే, అప్పట్లో జగన్ తరఫునే మాట్లాడిన వివేకా కూతురు సునీత మాత్రం సీబీఐ దర్యాప్తే కావాలని డిమాండ్ చేసింది. మరికొందరు టీడీపీ నేతలు తమను అన్యాయంగా ఇరికిస్తారు.. సీబీఐ దర్యాప్తు చేస్తేనే నిష్పక్షపాతంగా జరుగుతుందని పిటిషన్లు వేశారు. అవన్నీ పరిశీలించిన కోర్టు కేసును సీబీఐకి అప్పగించారు. ప్రస్తుతం సీబీఐ అధికారులు కడప జిల్లాలో దర్యాప్తు చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates