బీజేపీ, సీపీఐపై పొలిటికల్ సర్కిల్స్ లో సెటైర్లు

ఏపీలో బీజేపీకి కేంద్ర నాయకత్వం అండ ఉంది. మోదీ, అమిత్ షా నిత్యం రాష్ట్ర నేతలతో టచ్ లో ఉంటూ దిశా నిర్దేశం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని నూరు పోస్తుంటారు. జనసేన, బీజేపీతో పొత్తు వ్యవహారం ఇంకా కొలిక్కి రానప్పటికీ సొంత బలాన్ని కొంతైనా పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. మరి గెలుస్తారా… అంత సీన్ ఉందా అంటే మాత్రం రాష్ట్ర బీజేపీ అధినాయక్వంలో ఆ విశ్వాసం లేదని తేలిపోయింది..

సోము వీర్రాజు చెప్పేశారు..

సర్పంచులకు నిధులు, విధులపై విజయవాడలో ఒక సదస్సు జరిగింది. క్షేత్రస్థాయిలో పనులు చేసేందుకు నిధుల కొరత ఏర్పడుతోందని, కొత్త నిధులు ఇవ్వకపోగా, ఉన్న నిధులను జగన్ ప్రభుత్వం లాగేస్తోందని సర్పంచులు వాపోయారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా హాజరయ్యారు. వీర్రాజు తనదైన శైలిలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. సర్పంచుల్లో అత్యధిక శాతం మంది వైసీపీ వారేనని, వచ్చే ఎన్నికల్లో వారు ఏ పార్టీకి మద్దతిస్తారో కూడా తనకు తెలుసని చెప్పుకొచ్చారు. పైగా పక్కనున్న సీపీఐ రామకృష్ణ వైపుకు తిరిగి… మా తమ్ముడు ఎప్పుడు మోదీ గారిని తిడుతుంటారు.. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలవడు, మేము గెలవము, ఆయనకు ఓటెయ్యరు, మాకు ఓటెయ్యరు.. అని భారీ డైలాగ్ వదిలారు..దానితో రామకృష్ణ నవ్వుతూ ఉండిపోయారు..

నిజమే కదా అంటూ సెటైర్లు

వీర్రాజు వ్యాఖ్యానం కొద్ది గంటల్లోనే ఏపీ రాజకీయాల్లో వైరల్ గా మారింది. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ నేతలు జోకులేయడం మొదలుపెట్టారు వీర్రాజు జోకుగా చెప్పినా నిజమే చెప్పారని వారన్నారు. విజయం సాధించలేమన్న సంగతి ఒప్పుకోవడం మామూలు విషయం కాదని, వీర్రాజులాంటి పెద్ద మనసు ఉన్నవారికే అది సాధ్యమని సెటైర్లు మొదలయ్యాయి. పైగా ఒక్క సీటు కూడా గెలవలేని సీపీఐ నేత రామకృష్ణ.. రోజుకు మూడు సార్లు మీడియా ముందుకు వస్తారని కూడా జోకులేస్తున్నారు. ఏదేమైనా వీర్రాజు మాట ఇప్పుడు కామెడీగానైనా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యిందని చెప్పక తప్పదు..