ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థి కోసం టీడీపీ వెతుకులాట‌!

కొన్ని కొన్ని విష‌యాలు చెప్పుకొనేందుకు ఇబ్బందిగా ఉంటాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేస్తామ ని.. వైసీపీని త‌రిమి కొడ‌తామ‌ని అంటున్న టీడీపీకి.. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులే లేక‌పోవ‌డం.. ఉన్న వాటిలో ఇద్ద‌రేసి చొప్పున ఉండ‌డం.. మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అన్న‌ద‌మ్ములే పోటీ ప‌డ‌డం.. స‌వాళ్లు రువ్వుకోవ‌డంతో పార్టీ ప‌రిస్థితి చిత్రంగా మారింది. దీనిని ఎందుకో చంద్ర‌బాబు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఎన్నిక‌ల స‌మ‌యం వ‌చ్చిన త‌ర్వాత చూసుకుందాం లే! అని అనుకుంటున్నారో.. లేక, ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులు లేక‌పోయినా ఫ‌ర్వాలేద‌ని భావిస్తన్నారో తెలియ‌డం లేదు. పైగా ఆయ‌నేమో.. 175కి 175 సీట్లో ఎందుకు గెల‌వ‌లేమ‌ని చెబుతున్నారు. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల‌ని కూడా అంటున్నారు. ఏదేమై నా.. చంద్ర‌బాబుకు వ్యూహాలు ఉన్నాయి. కానీ, కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులే లేక‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తోంది.

ఉదాహ‌ర‌ణ‌కు ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం, ప్ర‌కాశంలోని చీరాల‌, గుంటూరులోని ప‌శ్చిమ‌, విజ‌య వాడ‌లోని ప‌శ్చిమ‌, ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని ఏలూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో అస‌లు అభ్య‌ర్థులు లేరు.కొన్ని చోట్ల గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న‌వారు వైసీపీలోకి వెళ్లిపోగా.. ఓడిపోయిన వారు సైలెంట్ అయిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారికి టికెట్ ఇచ్చే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డంలేదు.

ఏలూరులో మాగంటి బాబు రాజ‌కీయంగా అచేత‌నం అయిపోయారు. దీంతో ఏలూరు పార్ల‌మెంటు, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి అంతు చిక్క‌డం లేదు. పోల‌వ‌రంలో ఇద్ద‌రు నేత‌లు కుస్తీ ప‌డుతున్నారు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లో జ‌న‌సేన దూకుడుగా ఉంది. టీడీపీ-జ‌న‌సేన పొత్తు కుదిరితే.. ఫ‌స్టు వ‌దులుకునే సీటు ఇదే. దీంతో ఇక్క‌డ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ప‌క్క చూపులు చూస్తున్నారు. ప‌శ్చిమ‌లో జ‌లీల్ ఖాన్ ఆరోగం బాగోలేదని బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఎంపీ సీటులో అన్న‌ద‌మ్ములు కొట్టేసుకుంటున్నారు. ఇలా.. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల కొర‌త తీవ్రంగా ఉంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.