తెలంగాణ రాజ్‌భవన్ వర్సెస్ అధికార పార్టీ ప్రధాన కార్యాలయం ప్రగతి భవన్‌ల మధ్య మళ్లీ రాజకీయ రచ్చ ప్రారంభమైందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గత రెండేళ్లుగా రాజ్‌భవన్‌కు, సీఎం కేసీఆర్‌కు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. తనకు వేతనం కూడా ఇవ్వడం లేదని, కనీసం ప్రొటోకాల్ కూడా దక్కడం లేదని.. ఇటీవల కూడా గవర్నర్ వ్యాఖ్యానించారు.
అయితే.. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్న కార్యక్రమంలో మాత్రం ఇద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. దీంతో హమ్మయ్య.. సమస్య సమసి పోయినట్టేనని అందరూ అనుకున్నారు. కానీ, ఎడమొహం పెడమొహం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ పరిణామంతో ఈ రెండు భవన్‌ల మధ్య పొసగడం లేదని.. ఇది ఇప్పట్లో కుదిరేపని కూడా కాదని.. ఒక వాదన వినిపిస్తోంది.
తాజాగా జనవరి 26 గణతంత్ర వేడుకలకు రాష్ట్రం రెడీ అవుతోంది. ఈ కార్యక్రమానికి అయినా.. ప్రభుత్వం నుంచి రాజ్‌భవన్‌కు ఆహ్వానం అందుతుందని రాజ్‌భవన్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. అయితే.. మరో మూడు రోజుల్లోనే కార్యక్రమం జరగనుండగా.. ఇప్పటి వరకు అలాంటి సంకేతాలు.. ప్రభుత్వం నుంచి రానేలేదు. దీంతో రాజ్‌భవన్‌లోనే ఏకాంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇక, ప్రభుత్వం కూడా.. తన మానాన తను ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రగతి భవన్‌లోనే గణతంత్ర వేడుకలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ దఫా బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన నేపథ్యంలో కేసీఆర్ ప్రసంగం కూడా దానికి తగినట్టుగా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ప్రగతి భవన్, రాజ్‌భవన్‌ల మధ్య సెగలు పొగలు ఇంకా సర్దుబాటు కాకపోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates