కేసీఆర్ సంచ‌ల‌నం….ఉస్మానియా ఆస్ప‌త్రి కూల్చివేత‌

ఇటీవ‌లి కాలంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి అత్యంత ఇర‌కాటంలో ప‌డింది ఉస్మానియా ఆస్ప‌త్రి విష‌యంలో. హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు ఆస్ప‌త్రి మొత్తం జ‌ల‌మ‌యం అయిపోయింది. రోగులు ఎంతో అవ‌స్థ‌లు ప‌డ్డారు. విప‌క్షాలు ఆ ప్రాంతాన్ని సంద‌ర్శించాయి. కేసీఆర్ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డాయి.

త‌ట‌స్థుల నుంచి సైతం కేసీఆర్ స‌ర్కారు కొన్ని కామెంట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా ముప్పేట దాడి నేప‌థ్యంలో…. ఉస్మానియా ఆస్ప‌త్రిని కూల్చివేసి కొత్త‌ది క‌ట్టాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

వాస్త‌వానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌స్తుత ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో కొత్త ఆస్ప‌త్రి క‌ట్టాల‌నుకున్నారు. 2015 జులై 23న ఉస్మానియా హాస్పిటల్‌ను సీఎం కేసీఆర్‌ సందర్శించారు. పురాతన భవనం కూల్చి కొత్తది కడతామన్నారు. తర్వాతి పరిణామాలతో కూల్చివేత నిర్ణయాన్ని సర్కారు వాయిదా వేసుకుంది. హాస్పిటల్‌ ఆవరణలోనే రెండు టవర్లు నిర్మిస్తామంది. కానీ అది ముందుకు కదల్లేదు. హాస్పిటల్‌ మెయింటెనెన్స్‌ కూడా ఆగిపోయింది.

మరోవైపు ఉస్మానియాను సర్కారు కూల్చాలని సిద్ధ‌మ‌వ‌డంతో చారిత్ర‌క ఆస్తుల పరిరక్షణ కోసం పని చేసే సంస్థ రంగంలోకి దిగింది. హాస్పిటల్‌ శిథిలావస్థకు చేరిందా లేదా పరిశీలించేందుకు ఎక్స్ పర్టుల కమిటీని నియమించింది. 2015 ఆగస్టు 2, 3 తేదీల్లో కమిటీ హాస్పిటల్‌ను సందర్శించి రిపోర్టు రెడీ చేసింది. బిల్డింగ్ శిథిలావస్థలో లేదని, గట్టిగా ఉందని రిపోర్టులో స్పష్టంగా చెప్పింది.

మెయింటెనెన్స్‌ లేక పెచ్చులు మాత్రం ఊడుతున్నాయని, గోడలు గట్టిగా ఉన్నాయని తేల్చింది. హాస్పిటల్‌ పైనుంచి వచ్చే వాన నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పైప్‌లైన్లు పగిలిపోయి ఉన్నాయని, దాంతో నీరు గోడల్లోకి వెళ్లిపోతోందని చెప్పింది. ఈ చెమ్మతోనే మొక్కలు మొలుస్తున్నాయని, వార్డుల్లోకి నీళ్లు లీక్ అవుతున్నాయని తెలిపింది. మెయింటెనెన్స్ సరిగ్గా చేస్తే బిల్డింగ్ చాలా కాలం పనికొస్తుందని స్పష్టం చేసింది.

దీంతో ఉస్మానియా ఆస్ప‌త్రి కూల్చివేత ఆగిపోయింది. తాజా ప‌రిణామాల్లో భారీగా వ‌ర‌ద నీరు ఉస్మానియా ఆస్ప‌త్రిలోకి చేరి రోగుల‌కు తీవ్ర అసౌక‌ర్యాన్ని క‌లిగించింది. జాతీయ స్థాయిలో ఈ అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉస్మానియా ఆస్ప‌త్రిని కూల్చివేసి దాని ప్రాంగ‌ణంలో అన్ని స‌దుపాయాల‌తో మ‌రో ఆస్ప‌త్రిని నిర్మించాల‌ని చూస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు త్వ‌ర‌లో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.