ఏపీలో నిఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన ఎస్టీ నియోజకవర్గం పోలవరం. ఇక్కడ కాంగ్రెస్ సంస్థాగత ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే 2004, 2009 వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దక్కించుకుంది. తర్వాత.. చంద్రబాబు దూకుడు, ఆయన చేసిన వస్తున్నా మీకోసం యాత్ర కారణంగా ఇక్కడ పార్టీ పుంజుకుంది. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో మొడియం శ్రీనివాసరావు విజయం దక్కించుకు న్నారు.
పార్టీ అధికారంలోకి రావడంతో.. మొడియం గెలిచీ గెలవగానే గల్లా పెట్టె
తెరిచేశారని అప్పట్లో పెద్ద వివాదం తెరమీదికి వచ్చింది. అంతేకాదు..తాను తీసుకునే ముడుపుల్లో తనకొక్కడికే కాదని.. ఎంతో మందికి వాటా ఉందని.. మీడియా మిత్రులకు కూడా ఇచ్చానని 2015లో ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర డ్యామేజీ చేశాయి. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న అప్పటి సీఎం చంద్రబాబు ఆయనను కొన్నాళ్ల పాటు మౌనంగా ఉండాలని హెచ్చరించారు.
తర్వాత ఏమైందో ఏమో.. 2019 ఎన్నికల సమయానికి మొడియం అడ్రస్ కనిపించలేదు. ఈ క్రమంలోనే బొరగం శ్రీనివాసరావు అనే మరో నాయకుడికి టికెట్ ఇచ్చారు. అయితే, ఈయన ప్రభావం ఇక్కడ కనిపించలేదు. దీంతో భారీ మెజారిటీతో వైసీపీ నాయకుడు తెల్లం బాలరాజు విజయం దక్కించుకున్నారు. కట్ చేస్తే.. వైసీపీ విధానాలు కావొచ్చు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాకపోవడం కావొచ్చు.. ఏదైనా కూడా ఇక్కడ వైసీపీ హవా తగ్గింది.
ఈ నేపథ్యంలో వైసీపీ ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ అవకాశం దక్కింది. కానీ, ఆదిశగా పార్టీ ప్రయత్నాలు చేయడం లేదు. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో తమకంటే తమకే టికెట్ దక్కుతుందని మొడియం వర్సెస్ బొరగంల మధ్య రాజకీయ యుద్ధం సాగుతోంది. పోనీ.. పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? అంటే అది కూడా లేదు. దీంతో వైసీపీ వ్యతిరేకత ఉన్నప్పటికీ.. దానిని తమకు అనుకూలంగా మార్చుకునే పనిని ఈ నేతలు చేయకపోవడం గమనార్హం.