కేశినేని నాని పై చంద్రబాబు ఆగ్రహం

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని హద్దులు మీరుతున్నట్లే కనిపిస్తోంది. స్వపక్షంలో విపక్షంలా తయారైన ఆయన తీరుతో పార్టీ శ్రేణులు తలలు పట్టుకు కూర్చుంటున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఎందుకలా మాట్లాడుతున్నారని ఎవరికీ అర్థం కావడం లేదు. తన సోదురుడు కేశినేని చిన్ని సహా కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న వారందరినీ ఆయన విమర్శిస్తున్నారు. కొందరి పేర్లను బహిరంగంగానూ, మరికొందరి పేర్లను నర్మగర్భంగానూ ప్రస్తావిస్తూ వారికి టికెటిస్తే పనిచేసేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. పైగా తనకు టికెటివ్వకపోయినా ఫర్వాలేదని, ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచే సత్తా తనకు ఉందని ప్రకటించి పార్టీ వారిని అందరినీ ఇరకాటంలోకి నెట్టేశారు..

ఎన్టీఆర్ వర్థంతి రోజున వివాదాస్పద వ్యాఖ్యలు

ఎన్టీఆర్ వర్థంతి రోజున కూడా కేశినేని నాని తన పంథానే కొసాగించారు. విజయవాడ నియోజకవర్గం పరిధిలో అనేక చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న నాని.. పలువురు నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. పార్టీలో ప్రక్షాళణ జరగాలని, నిజాయతీగా పని చేసే వారికే టికెట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆస్తులు పోగొట్టుకున్న వారికి కాకుండా సంపదను కూడబెట్టుకున్న వారికి టికెట్లిస్తున్నారని కూడా కేశినేని ఆరోపించారు.

ఆరా తీసిన చంద్రబాబు

కేశినేని నాని కామెంట్స్ సాయంత్రానికి పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి చేరాయి. కొంతమంది సీనియర్ నేతలకు ఫోన్ చేసిన బాబు అసలు విజయవాడలో ఏం జరుగుతోందని ఆరా తీశారు. మైలవరం నుంచి విజయవాడకు మారాలనుకుంటున్న దేవినేని ఉమతో పాటు బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా సహా పలువురిపై నాని విరుచుకుపడుతున్నట్లు అధినేతకు వారు ఫిర్యాదు చేశారు. విజయవాడ లోక్ సభ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే అంతమంది ఇంఛార్జులతోనూ నాని గొడప పడే పరిస్థితి ఉందని పార్టీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారు. దానితో సంయమనం పాటించాలని అన్నీ తాను చూసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారట. ఒకటి రెండు రోజుల్లో పరిస్థితిని చక్కబెట్టేందుకు చంద్రబాబు తన శైలిలో పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి..