దివంగత మహానాయకుడు, తెలుగు వారి అన్నగారు.. ఎన్టీఆర్ వర్ధంతి ఈరోజు. ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరంలో ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ.. టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతిని ఆర్భాటంగా చేయాలని నిర్ణయించుకుంది. దీనికి సంబందించి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు కూడా చేసుకుంది. అయితే.. అదే సమయంలో సీఎం జగన్ కూడా తనదైన శైలిలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరగకుండా.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడివాడ, మైలవరం మరోసారి వేడెక్కాయి. అదేవిధంగా గుంటూరు జిల్లాలోని మాచర్లలో మంగళవారం రాత్రి నుంచి 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.ఇ క, కుప్పంలో పోలీస్ యాక్ట్ 30ని రాత్రికి రాత్రి అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈ రెండింటినీ కలిపి అమలు చేస్తున్నారు. ఎక్కడా కూడా ప్రజలు గుమికూడరాదని.. పోలీసు చట్టాలను గౌరవించాలని.. పోలీసులు ప్రచారం చేస్తున్నారు.
దీంతో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరుగుతాయా? లేదా? అనేది సందేహంగా మారింది. పలు ప్రాంతాల్లో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసినా.. నాయకులు బయటకు రాకుండా.. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కీలక నేతలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. జీవో 1 ప్రకారం ఈ నోటీసులు ఇవ్వడం విస్మయాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి ఇటీవల హైకోర్టు దీనిని సస్పెండ్ చేసింది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో జీవో 1 లైవ్‌లో ఉందని అధికారులు చెబుతుండడం గమనార్హం.
మరోవైపు.. చంద్రబాబు కూడా రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో పాల్గోనేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. కీలక నాయకులను రాకుండా పోలీసులు అడ్డుకోవడం.. ఎక్కడికక్కడ వేసిన టెంట్లను తొలగించేలా టెంట్ హౌస్ నిర్వాహకులకు పోలీసులు ఆదేశాలు జారీ చేయడం ఆసక్తిగా మారింది. మొత్తానికి ఎన్టీఆర్ అంటే.. గౌరవం ఉందని చెప్పే వైసీపీ పాలనలో ఆయన వర్ధంతి ఏర్పాట్లను అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది.