పుంగ‌నూరు-కుప్పం.. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ

ఏపీ రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు చంద్ర‌బాబును సీఎం జ‌గ‌న్ టార్గెట్ చేశారు. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ‌ర్సెస్ చంద్ర‌బాబుగా రాజ‌కీయం మారిపోయింది. అయితే.. దీని వెనుక ఏదో ఒక వ్యూహం ఉంద‌ని అంటున్నారు. ఏమీ లేకుండా.. చంద్ర‌బాబును ఇంత‌గా ఒత్తిడికి గురి చేయ‌ర‌ని కూడా రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా.. రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయాల‌ను చూస్తే..చంద్ర‌బాబును తీవ్ర ఒత్తిడిలో నింపే ప్ర‌య‌త్నం చేశారనేది క‌నిపిస్తోంది. అయితే.. దీనికన్నా ఎక్కువ‌గా.. ఇప్పుడు చంద్ర‌బాబును త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఓడిస్తాన‌ని.. శ‌ప‌థం చేయ‌డం ద్వారా మంత్రి పెద్దిరెడ్డి ద్వారా.. వైసీపీ అధిష్టానం ఒక కీల‌క రాజ‌కీయ వ్యూహాన్ని అనుస‌రింప‌జేస్తోంద‌నే వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. నిజానికి కుప్పంలో పెద్దిరెడ్డి పాత్ర నిన్న‌టి వ‌రకు వేరేగా ఉంది.

ఇక్క‌డి రాజ‌కీయాల‌ను మాత్ర‌మే ఆయ‌న మేనేజ్ చేశారు. అలాంటిది ఒక్క‌సారిగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తానే ఇక్క‌డ నుంచి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం.. చంద్ర‌బాబు ఓడిస్తాన‌ని శ‌ప‌థం చేయ‌డం.. ఆయ‌న‌కు డిపాజిట్ కూడా రాకుండా చేస్తాన‌ని చెప్ప‌డం ద్వారా బాబును మ‌రింత ఒత్తిడికి గురిచేయాల‌నేది వైసీపీ తాజా వ్యూహంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రోవైపు.. ఈ వ్యూహంలో చంద్ర‌బాబు చిక్కుకున్న‌ట్టుగానే క‌నిపిస్తోంది.

ఆయ‌న కూడా పుంగనూరులో పెద్దిరెడ్డి ఎలా విజ‌యం ద‌క్కించుకుంటారో చూస్తాన‌ని చెప్పారు. నిజానికి పుంగ‌నూరులో టీడీపీ పెద్ద‌గా బ‌లంగా లేదు. ఉన్న శ్రేణులు. పార్టీ నాయ‌కులు అంద‌రూ కూడా.. గ‌త స్థానిక ఎన్నికల స‌మ‌యానికి టీడీపీని వీడారు. ఇప్పుడు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటే.. చంద్ర‌బాబు ఎక్కువ స‌మ‌యంలో వీటికే కేటాయించాలి. దీంతో రాష్ట్రం మొత్తంపై ఆయ‌న ఫోక‌స్ అంతో ఇంతో త‌గ్గుతుంద‌నేది వైసీపీ భావ‌న‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.