బీజేపీతో టీడీపీ కలిస్తే గెలిచేది వైసీపీయేనట

వరుస సభలు, పోటెత్తుతున్న ప్రజలు తెలుగుదేశం పార్టీలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అయితే, ఆ ఉత్సాహాన్ని చల్లార్చేలా తాజాగా ఓ సర్వే కొన్ని విషయాలను వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది.. జనసేనతో కలిసి వెళ్తే ఎలా ఉంటుంది.. జనసేన, బీజేపీలు రెండింటినీ కలుపుకొని వెళ్తే ఎలాంటి ఫలితం ఉంటుందనేది ఆ సర్వే అంచనా వేసింది. ఈ అంచనాలు ఎంతవరకు కరెక్టు అనేది పక్కనపెడితే సర్వే లేవనెత్తిన కొన్ని కీలక అంశాలను మాత్రం టీడీపీ అర్థం చేసుకుంటే మంచిదనే భావన వ్యక్తమవుతుంది.

ప్రధానంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి నష్టమే తప్ప లాభం లేదని.. టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటే మళ్లీ వైసీపీ గెలుపు ఖాయమని ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే మొత్తం ముగ్గురికీ కలిపి 60 నుంచి 75 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చింది. అలా కాకుండా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే 100 నుంచి 120 సీట్లు వస్తాయని అంచనా వేసింది ఈ సర్వే. మరోవైపు 41 నియోజకవర్గాలలో టీడీపీ ఇంచార్జులను మార్చాల్సిన అవసరం ఉందని ఈ సర్వే తెలిపింది.

కేంద్రంలోని బీజేపీ పట్ల వ్యతిరేకత ఉందని.. ఆ వ్యతిరేకత ప్రభావం ఆ పార్టీతో కలిస్తే టీడీపీపైనా పడుతుందని ఆత్మసాక్షి సర్వే అభిప్రాయపడింది. ప్రధానంగా ఉత్తరాంధ్రలో నష్టం కలగుతుందని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం నేపథ్యంలో బీజేపీతో కలిస్తే టీడీపీకి నష్టమేనని తేల్చింది ఈ సర్వే. అయితే… ఈ సర్వే 41 స్థానాలలో టీడీపీ ఇంచార్జులను మార్చాలని సూచించిన నేపథ్యంలో పార్టీ దీన్ని రివ్యూ చేసుకుంటే బాగుండొచ్చని పరిశీలకులు సూచిస్తున్నారు.