టీడీపీ అధినేత చంద్రబాబు భోగి పండుగ సందర్భంగా నారావారి పల్లెలో మీడియాతో మాట్లాడుతూ.. సంచ లన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో 150-160 కాదు.. 175 నియోజకవర్గాల్లో 175 చోట్లా విజయం దక్కించు కోవాలి.. వైసీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి.. అని అన్నారు. నిజానికి ఇన్నేళ్లలో అంటే.. 2014 నుంచి 2023 వరకు కూడా చంద్రబాబు నోటి నుంచి ఈ మాట రాలేదనే చెప్పాలి.
కనీసం.. వైసీపీ అధినేత జగన్ చేసిన వైనాట్ 175 ప్రకటన తర్వాత కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ప్రకటన చేయలేదు. జగన్ వైనాట్ 175 ప్రకటించి.. దాదాపు ఆరు మాసాలు అయిపోయింది. ఆయన ఎక్కడ ఎప్పుడు పార్టీ నేతలతో భేటీ అవుతున్నా.. వెంటనే ఈ మాటను చెబుతున్నారు. కానీ, అప్పట్లో మౌనంగా ఉన్న చంద్రబాబు.. బీజేపీ, జనసేనతో పొత్తు కోసం.. ప్రయత్నించారే తప్ప.. పూర్తిస్థాయిలో పోటీకి కానీ.. గెలుపు కోసం ఒక్క చిన్న ప్రకటన చేయలేదు.
కానీ, ఇంతలోనే ఆయన నోటి నుంచి ఆణిముత్యం వంటి మాట దొర్లింది. సరే.. మాట అయితే.. అనేశారు. మరి.. 175/175 సీట్లలో విజయం దక్కించుకునేందుకు టీడీపీకి ఉన్న సానుకూలతలు ఏంటి? ఎలా? అనేది ఆసక్తిగా మారింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు జోష్ పెరిగినప్పుడు కూడా.. ఆయన పాదయాత్ర, బస్సు యాత్ర చేసిన సమయంలోనూ 120 ఫిగర్ చేరుకోలేక పోయారు. మరిఇప్పుడు వైసీపీ ప్రభంజనం.. సంక్షేమం ఉందని.. వైసీపీ నేతలు చెబుతున్న సమయంలో చంద్రబాబు ప్రకటన ఆసక్తి రేపుతోంది.
అంతేకాదు.. ఈ ప్రకటనతో ఆయన పొత్తులకు బ్రేక్ ఇచ్చినట్టేనా.. అనే మరో చర్చ కూడా సాగుతోంది. ఇంకో వైపు.. అసలు 175 నియోజకవర్గాల్లో 20 నుంచి 30 స్థానాల్లో అసలు ఇంచార్జ్‌లే లేరనే టాక్ వినిపిస్తోం ది. ఉన్న చోట కూడా.. ఎవరిలో వారు గిల్లి కజ్జాలు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సమయంలో అత్యంత కీలకమైన ఎన్నికలని చంద్రబాబే చెబుతున్న వేళ.. 175 టార్గెట్ సాధ్యమేనా.. లేక నోటి మాటగా ఆయన చెప్పి వదిలేశారా? అనేది ఆసక్తిగా మారింది. చూడాలి మరి ఆయన ఏం చేస్తారో.
Gulte Telugu Telugu Political and Movie News Updates