జేడీ గారి జగన్ భజన

సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు పాపులారిటీ వచ్చిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల విచారణ వల్ల. సీబీఐ జేడీగా ఉండగా ఈ కేసును డీల్ చేసిన ఆయన పెద్ద హీరో అయిపోయారు. ఆయన ఇంటి పేరు ఎవరికీ తెలియదు. సీబీఐ జేడీగా పని చేయడం వల్ల.. జేడీ అనేదే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. అవినీతిపరుల పాలిట సింహస్వప్నం లాగా ఆయన్ని చూసేవారు యూత్. అలాంటి వ్యక్తి.. గత కొన్నేళ్లలో తన పట్ల జనాల దృష్టికోణమే మారిపోయేలా చేశారు. 

సిల్లీ కారణాలు చెప్పి జనసేన పార్టీకి దూరం అయ్యాక.. నెమ్మదిగా ఆయన జగన్ వైపు ఆకర్షితులవుతుండడం విశేషమే. ఈ మధ్య తరచుగా జగన్‌ను పొగిడేస్తున్నారు. ఇటీవల ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా జగన్ సర్కారు తీసుకొచ్చిన జీవో-1కు లక్ష్మీనారాయణ మద్దతు పలకడం గమనార్హం. ఈ జీవో ఉద్దేశం మంచిదే అని లక్ష్మీనారాయణ భావించి ఉండొచ్చు కానీ.. ప్రతిపక్షాలను ఈ జీవో పేరుతో అడ్డుకుంటూ, అధికార పార్టీ నేతలు మాత్రం యథేచ్ఛగా సభలు, రోడ్ షోలు నిర్వహిస్తుండడం లక్ష్మీనారాయణకు కనిపించకపోవడం విడ్డూరం. 

తాజాగా లక్ష్మీనారాయణ.. జగన్ ప్రభుత్వం నెత్తికెత్తుకున్న వికేంద్రీకరణ సిద్ధాంతానికి మద్దతు పలకడం విశేషం. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఒకే చోట ఉండడం సరికాదని.. వేర్వేరు ప్రాంతాలకు ఆయా వ్యవస్థలను తరలించడం మంచిదే అని, ప్రతి జిల్లా అభివృద్ధి కావాలని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.

ఐతే నిజంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న ఉద్దేశంతోనే జగన్ సర్కారు మూడు రాజధానుల ప్రతిపాదన తేలేదన్నది జనాలకు స్ఫష్టంగా అర్థమైపోయింది. ఈ పేరుతో వైసీపీ ఆడుతున్న డ్రామా బట్టబయలైపోయింది. అసలు విషయం అందరికీ అర్థమవుతున్నప్పటికీ లక్ష్మీనారాయణ వికేంద్రీకరణకు మద్దతు పలకడం అంటే జగన్‌ను మెప్పించే ప్రయత్నం లాగే కనిపిస్తోంది. ఇటీవల ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే వైసీపీలో చేరి వచ్చే ఎన్నికలకు ఎమ్మెల్యేగానో, ఎంపీగానో పోటీ చేసినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది.