కేశిసేని నాని.. కొన్ని సందర్భాల్లో స్వపక్షంలో విపక్షంగా వ్యవహరిస్తుంటారు. టీడీపీ తీరునే విమర్శిస్తుంటారు. చంద్రబాబును సైతం లెక్కచేయకుండా మాట్లాడుతుంటారు. పార్టీలో తానో పవర్ సెంటర్ అన్నట్లుగా పావులు కదుపుతుంటారు. విజయవాడ మొత్తం తనదేనని ఫీలైపోతుంటారు. ఇప్పుడు కూడా కేశినేని నాని అదే పద్ధతిలో మాట్లాడుతున్నారు..
వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ల పంపిణీ ఎలా ఉండాలో, ఎవరికి టికెట్లు ఇవ్వాలో కూడా కేశినేని చెప్పేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోటీ చేసే హక్కుందని చెబుతూనే 420లు, డిక్టేటర్లు, కాల్ మనీ వ్యాపారులు, దావూద్ ఇబ్రహీంలు, చార్లెస్ సోభ్ రాజ్ లాంటి వారికి టికెట్లివ్వకూడదంటూ అధిష్టానానికి హితబోధ చేస్తున్నారు. ముగ్గురు నేతలకు పార్టీ నామినేషన్ ఇస్తే మాత్రం ఊరుకునేది లేదని తేల్చేశారు. పరోక్షంగా బెజవాడ టీడీపీ నేతలపై ఆయన కామెంట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.
ఇటీవల నాని … టీడీపీ నుంచి వైదొలుగుతారని ప్రచారం జరిగింది. దానితో ఆయన తమ్ముడు కేశినేని పండు రంగంలోకి దిగారు టీడీపీ తరపున క్రియాశీలమయ్యారు. అన్నకంటే తాను బెటరని టీడీపీ టికెట్ తనకివ్వాలని ప్రచారం చేసుకున్నారు. దానితో నానికి చిర్రెత్తుకొచ్చింది. పండుకు టికెటిస్తే టీడీపీకి తాను మద్దతివ్వనని నాని తాజాగా ప్రకటించారు.
ఎవరా ముగ్గురు ?
కేశినాని నాని ప్రస్తావించిన ఆ ముగ్గురు ఎవరన్న చర్చ విజయవాడ మొత్తం జరుగుతోంది. బోండా ఉమ, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాను ఉద్దేశించి కేశినేని పరోక్షంగా ఘాటైన పదజాలాన్ని వాడారని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీ మొత్తాన్ని హైజాక్ చేసేందుకు బోండా ఉమ, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా ప్రయత్నిస్తున్నట్లుగా పసిగట్టిన నాని… ఇప్పుడే అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ లోక్ సభ సభ్యుడిగా ఉన్న కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అసెంబ్లీకి బరిలో దిగాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆయనకు టికెట్ రాకుండా చేసేందుకు ఆ ముగ్గురు ప్రయత్నిస్తున్నట్లు నాని పసిగట్టారు అందుకే కోపం ఆపుకోలేక నాలుగు తిట్లు తిట్టారని కూడా చెబుతున్నారు….