రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన సెంటిమెంటుగా ఉన్న రాజధాని అమరావతి విషయం ఇప్పుడు వైసీపీలో చర్చకు వస్తుండడం గమనార్హం. సాధారణంగా.. నిన్న మొన్నటి వరకు టీడీపీ సహా.. జనసేనలో ఈ విషయం ఆసక్తిగా ఉంది. రాజధాని అమరావతికే తమ మద్దతు అని టీడీపీ బాహాటంగానే ప్రచారం చేసింది. అయితే.. తర్వాత చంద్రబాబు జిల్లాల పర్యటన చేశారు. ఈ క్రమంలో అక్కడి ప్రజల నాడిని తెలుసుకున్నారు.
పైకి మౌనంగానే ఉన్నప్పటికీ.. ఉత్తరాంధ్ర, సీమ ప్రాంతాల్లో వరుసగా చంద్రబాబు పర్యటించారు. ఈ క్రమంలో ఆయన తెప్పించుకున్న సర్వేల నివేదికల ఆధారంగా ఏమైందో ఏమో.. అమరావతి గురించిన ప్రస్తావనను తగ్గించేసి.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపైనే దృష్టి పెట్టారు. సీఎం జగన్‌ను కార్నర్ చేసుకుని విమర్శలు గుప్పించారు. అయితే.. ఇప్పుడు చిత్రంగా అదే అమరావతి ఇష్యూపై వైసీపీలో చర్చసాగుతోంది.
ఎందుకంటే.. ప్రస్తుతం హైకోర్టు అమరావతికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆరుమాసాల్లో ఇక్కడ అభివృద్ది చేయాలని తేల్చి చెప్పింది. దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేసినా.. సమయాన్ని తప్పు బట్టిందే తప్ప.. రాజధానిని తప్పు బట్టలేదు. పైగా.. అమరావతికి అనుకూలంగా ఉన్నట్టుగా సంకేతాలు పంపించింది. రైతుల సెంటిమెంటును తీవ్రంగా భావించింది. ఈ నెలలో మరోసారి సుప్రీంకోర్టు ఈ విషయాన్ని విచారించనుంది.
ఈ క్రమంలో సుప్రీంకోర్టు అమరావతికి అనుకూలంగా ఏదైనా తీర్పు ఇస్తే ఏం చేయాలనేది వైసీపీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. రాజకీయ పక్షాలు ఏమనుకుంటున్నాయని ఆరాతీస్తే.. దాదాపు అవి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, రాజధాని రైతులుకూడా సుప్రీం కోర్టు తీర్పు కోసం..చూస్తున్నారు. ఈ పరిణామాలతో ప్రభుత్వ పరంగా ఏం చేయాలి..? ఎన్నికలకు ముందు అమరావతి అజెండాను అందుకుంటే.. నష్టమని.. కాబట్టి దీనికి విరుగుడుగా ఎలా ముందుకుసాగాలనేది ఆసక్తిగా మారిందని అంటున్నారు.