లోకేష్ ను ఓడించడం అంత ఈజీ కాదా?

నారా లోకేశ్ నియోజకవర్గం మంగళగిరిలో రాజకీయం మారుతోంది. మళ్లీ అక్కడ లోకేశ్‌ను ఓడిస్తామంటూ వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నా పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు. సిటింగ్ వైసీసీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలాకాలంగా సైలెంటుగా ఉన్నారు.. ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత కూడా పెద్దఎత్తున కనిపిస్తోంది. అదేసమయంలో ఆయన అనుచరవర్గమూ జారిపోతోంది. తాజాగా మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాస్ టీడీపీలో చేరడానికి అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయని చెప్తున్నారు.

కాండ్రు శ్రీనివాస్ జనవరి 18న టీడీపీలో చేరనున్నట్లు చెప్తున్నారు. కొద్దికాలంగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన టీడీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నప్పటికీ ఏమాత్రం గుర్తింపు లేదని ఆయన చాలాకాలంగా ఆగ్రహిస్తున్నారు. మంగళగిరి మున్సిపాలిటీలో పట్టున్న నేత అయిన కాండ్రు టీడీపీలో చేరితే వైసీపీకి అది భారీ దెబ్బే.

టీడీపీ నుంచి లోకేశ్ అక్కడ పోటీ చేస్తారు కాబట్టి భవిష్యత్తులో ఇక తమకు టికెట్ దొరకదని భావించి వైసీపీలోకి గతంలోనే వెళ్లిపోయిన మురుగుడు హనుమంతరావు, గంజి చిరంజీవిలు కూడా అక్కడ ప్రధాన వర్గాలుగా ఉన్నారు. వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి టికెట్ వస్తుందా రాదా అన్నది అనుమానం. మొత్తంగా వైసీపీలో ఇక్కడ మూడు వర్గాలు ఉండడంతో ఎవరికి టికెట్ ఇచ్చినా కొట్లాట తప్పదు.

ఈ నేపథ్యంలోనే కాండ్రు శ్రీనివాస్ కూడా టీడీపీలో చేరుతున్నారని… మంగళగిరిలో ఈసారి వైసీపీ ఓటమి తప్పదని స్థానికులు చెప్తున్నారు. కాండ్రు టీడీపీలోకి రావడంతో అర్బన్‌లో టీడీపీ మరింత బలపడుతోంది.