ఏపీలో క‌రోనా మ‌ర‌ణాల లెక్క‌లు చూస్తే వ‌ణుకే

తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలకు సంబంధించిన గ‌ణాంకాలు చూస్తుంటే వామ్మో అనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త కొన్ని రోజులుగా న‌మోద‌వుతున్న కేసులు, మ‌ర‌ణాల సంఖ్య భ‌యం గొలిపేలా ఉంది. అంద‌రూ కేసుల సంఖ్య‌నే చూస్తున్నారు కానీ.. మ‌ర‌ణాల మీద దృష్టిసారించ‌ట్లేదు. ప్ర‌భుత్వం కూడా బులిటెన్లో జిల్లాల వారీగా, ఓవ‌రాల్‌గా కేసుల సంఖ్య‌ను చెబుతోంది. అలాగే ఇప్ప‌టిదాకా న‌మోదైన మొత్తం మ‌ర‌ణాల సంఖ్యా ఇస్తోంది. కానీ రోజు వారీ మ‌ర‌ణాల టోట‌ల్ నంబ‌ర్ ఎక్క‌డా ప్ర‌స్తావించ‌ట్లేదు. ఒక్కో జిల్లాలో ఇంత‌మంది అని చెబుతోంది. కానీ అన్ని జిల్లాల మ‌ర‌ణాల్ని క‌లిపి చివ‌ర‌గా వ‌చ్చే నంబ‌ర్ చూస్తే ప‌రిస్థితి పూర్తిగా అదుపు త‌ప్పిన సంగ‌తి అర్థ‌మ‌వుతుంది.

కేవ‌లం ఎనిమిది రోజుల వ్య‌వ‌ధిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 368 మంది కోవిడ్ వ‌ల్ల మ‌ర‌ణించ‌డం గ‌మ‌నార్హం. ఆదివారం ఏకంగా 56 మంది క‌రోనా పేషెంట్లు ప్రాణాలు వ‌దిలారు. సోమ‌వారం కూడా దాదాపుగా అదే స్థాయిలో 52 మంది క‌రోనాతో మృతి చెందారు. ప్ర‌తి జిల్లాలోనూ క‌రోనా మ‌ర‌ణాలున్నాయి. గోదావ‌రి జిల్లాలు రెండింట్లో క‌లిపితే రోజూ రెండంకెల సంఖ్య‌లో మ‌ర‌ణాలుంటున్నాయి. రాష్ట్రంలో రోజుకు ఇద్ద‌రు ముగ్గురు చ‌నిపోతున్న‌పుడు అమ్మో అనుకున్న జ‌నాలు కూడా.. ఇప్పుడు రోజుకు 50 మంది చనిపోతుంటే మామూలుగా చూస్తుండ‌టం.. ప్ర‌భుత్వం తీవ్ర‌త‌ను గుర్తించక‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. ఏపీలో సోమ‌వారం 4 వేల‌కు పైగా కొత్త క‌రోనా కేసులు వెలుగు చూడ‌గా.. మొత్తం కేసుల సంఖ్య 50 వేల మార్కును దాటిపోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 696కు చేరుకుంది.