శ్రీకాకుళంలోని రణస్థలంలో జనసేన అదినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు ఇంకా కాకరేపుతూనే ఉన్నాయి. మంత్రులు ఒక్కొక్కరుగా పవన్‌పై ఫైర్ అవుతున్నారు. తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. పవన కళ్యాణ్ సీజనల్ పొలిటీషియన్ అని వ్యాఖ్యలు చేశారు. యువతను అజ్ఞానంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
శ్రీకాకుళంలో 2014 నుంచి 2018 వరకు ఉన్న కిడ్నీ బాధితుల సమస్యలు జగన్ పాలనలో ఉన్నాయా? అని మంత్రి ధర్మాన ప్రశ్నించారు. పుస్తకాలు చదవడం కాదని.. ఆ గొప్పవారి భావజాలం పవన్‌లో కనిపించాలని సూచించారు. అమరావతి పేరుతో జరుగుతున్న రియల్ ఎస్టేట్‌ను పవన్ సమర్థిస్తున్నారని, ప్రజల పన్నులన్నీ తీసుకువెళ్లి అమరావతి అభివృద్ధి చేస్తామంటే ఉత్తరాంధ్ర వ్యక్తిగా తాను అంగీకరించబోనని ధర్మాన ప్రసాదరావు చెప్పారు. పవన్ ఎవరితో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు.
నిజాయితీ ఉన్న నేతలకు మద్దతు ఇస్తామని చెబుతున్నారని, అవినీతిపరుడైన చంద్రబాబును సమర్థించి శ్రీశ్రీ నీతులు చెబుతావా? అని నిలదీశారు. పవన్ కల్యాణ్‌కు ఒక స్టాండ్ లేదని, తన లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేకపోతున్నారో ఆయన ఆలోచించాలని ధర్మాన అన్నారు. చంద్రబాబుకు పొరపాటున అధికారం ఇస్తే మళ్ళీ అమరావతిలోనే పెట్టుబడి పెడతారన్నారు. ఒకవేళ అదే జరిగితే విశాఖ కేంద్రంగా తమకు ప్రత్యేక రాష్ట్రం అడుగుతామని, అవసరమైతే ఉద్యమాలు కూడా చేస్తామన్నారు.
తాను సైనికుల భూములు కబ్జా చేశానంటున్నారని.. తాను భూమి కబ్జా చేశానని ఏ సైనికుడైనా చెప్పారా? అని ధర్మాన ప్రశ్నించారు. తాను కబ్జా చేశానని నిరూపిస్తే.. ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. గతంలోనే తాను సవాల్ చేశానని అయినా.. ఎవరూ పట్టించుకోలేదంటే.. తాను తప్పు చేయలేదనే కదా! అని ధర్మాన వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates