“శ్రీకాకుళంలోని రణస్థలంలో పవన్ కళ్యాణ్ యువశక్తి సభలో చెప్పిన మాటల్లో తప్పేంటి. వైసీపీ నేతలకు విలువలు ఉన్నాయా?” అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. సేవాభావంతో పనిచేసే వ్యవస్థ రాజకీయమని దీనినే తాను కూడా కోరుకుంటానని చెప్పారు. వ్యక్తిగతంగా తన లెక్క ప్రకారం అర్హత లేని వ్యక్తులు వైసీపీ నేతలుగా ఉన్నారని, మరికొందరు గాలికి తిరిగే వాళ్లంతా మంత్రులు అయ్యారని చంద్రబాబు విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రౌడీయిజం, గుండాయిజం, హత్యలు, కుట్రలు, కుతంత్రాలకు తావులేదన్నారు.
వైసీపీ నేతలు తమ తప్పులను పోలీసుల ద్వారా కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. మేడిన్ చైనా కాకుండా .. మేడిన్ ఇండియాగా అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. మరోవైపు సంక్రాంతి పండుగనుకూడా సీఎం జగన్ హరించి వేశారని.. పేదల ఇళ్లలో సంతోషం లేకుండా చేశారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు పండుగ కానుకలను ఇచ్చే సంప్రదాయానికి నాంది పలికామని గుర్తు చేశారు.
ఏడాదికి 350 కోట్లు ఖర్చు చేసి ప్రతి పేదల ఇంట్లోనూ సంక్రాంతి పండుగ సంతోషాన్ని నింపామని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన ఆ చిరుకానుకే పండగపూట పేదల మనసులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఆనాడు రాష్ట్రంలో వచ్చిన ఆ స్పందన చూసిన, టీడీపీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని తమిళనాడు ప్రభుత్వం కూడా సంక్రాంతి కానుకల పంపిణీ ప్రారంభించిందన్నారు. అలాంటిది సైకో సీఎం జగన్ ప్రభుత్వం పేద ప్రజల పట్ల కనీసం ఆలోచన కూడా చెయ్యకపోవడం దారుణమన్నారు.
రైతు రథం కింద ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు సబ్సిడీలతో రైతన్నలకు తోడుగా నిలిచామని చంద్రబాబు చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా దేశ విదేశాల నుండి స్వగ్రామాలకు తరలి వస్తున్న ప్రజలు.. వివిధ రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన మీరు గ్రామాభివృద్దికి మీ వంతు సహాయం చేయాలని కోరుతున్నానని చంద్రబాబు పిలుపునిచ్చారు.