ఏపీలోని వైసీపీ సర్కారుకు మరోసారి హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. తాజాగా ఈ నెల మొదట్లో ప్రభు త్వం జీవో 1/2023 తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రోడ్లపై ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు చేసేందుకు ఈ జీవో అనుమతించదు. అదేసమయంలో రోడ్లపై షోలు, బహిరంగ సభలు పెట్టుకునేందుకు కూడా ఈ జీవో అనుమతించదు. ఈ పరిణామాలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
కేవలం టీడీపీ సహా ఇతర పక్షాలను అడ్డుకునే క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం ఈ జీవోను తీసుకువచ్చిందనే వాదన బలంగా వినిపించింది. అయినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం తనను తాను సమర్థించుకుంది. గుంటూ రు, కందుకూరు ఘటనల్లో ప్రజలు చనిపోయారని.. ప్రజల ప్రాణాల రక్షణకు ప్రభుత్వం పూచీ వహించాల్సి ఉంటుందని.. అందుకనే ఈ జీవోను తీసుకువచ్చామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది.
ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ జీవోను సవాల్ చేస్తూ.. రెండు రోజుల కిందట హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని తాజాగా విచారించిన హైకోర్టు.. జీవో 1/2023ని సస్పెండ్ చేసింది. ఈనెల 23 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఈ నెల 20న తిరిగి విచారించనున్నట్టు పేర్కొంది. జీవో 1… నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే జీవోను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.