ఆమెకు ప్రేమ‌ను పంచా.. ద్వేషం క‌క్కింది: చిరంజీవి

మెగా స్టార్ చిరంజీవిపై ఇటీవ‌ల కాలంలో వైసీపీ మంత్రి, ఫైర్ బ్రాండ్ రోజా.. విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా నాగ‌బాబుకు ఇస్తున్న కౌంట‌ర్ల‌లో రోజా.. ఎక్కువ‌గా చిరును కోట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి తాజాగా రోజాపై కామెంట్లు చేశారు. అయితే.. రోజాలాగా ఫైర్ బ్రాండ్ వ్యాఖ్య‌లు చేయ‌లేదు. సూటిగా సున్నితంగా మ‌న‌సును త‌ట్టేలా కామెంట్లు చేశారు చిరంజీవి.

రోజా చేసిన ప‌రుష‌ వ్యాఖ్యలపై తాను మాట్లాడాలనుకోవడం లేదని చిరంజీవి వ్యాఖ్యానించారు. తాను చేస్తున్న సేవలకు సీసీటీ, బ్లడ్‌బ్యాంక్‌, ఆక్సిజన్‌ బ్యాంక్.. వంటివి నిలువెత్తు నిదర్శనాలని ఆయన చెప్పారు. “ఆ సమయానికి ఆమె అలా అనాల్సి వచ్చిందేమో. ఆమె చేసిన వ్యాఖ్యల గురించి నేను ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు. నేను ఎలాంటి సేవలు చేశాను, చేస్తున్నాను అనేది అంద‌రికీ తెలుసు” అని చిరు వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. తాను రాజకీయాల్లో ఉన్నప్పుడైనా, లేదా త‌ర్వాతైనా.. ఎదుటి వారు త‌న‌పై ఎలాంటి విమర్శలు చేసినా వాటిపై స్పందించాలని అనుకోలేద‌ని చిరంజీవి చెప్పారు. “రోజా మా ఇంటికి వచ్చారు. మాతో కలిసి భోజనం చేశారు. సొంతవారిలా కలిసి ఉన్నారు. ఇప్పుడు వాళ్ల నైజం ప్రకారం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆ వ్యాఖ్యలపై స్పందించడం నా నైజం కాదు. వాళ్లు ఏం మాట్లాడినా అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా” అని చిరు చుర‌కలు అంటించారు.

“రోజా కుంటుంబంతో అనుబంధాన్ని ఎప్పుడూ పదిలంగానే చూసుకుంటా. ఇంకా ఏం మాట్లాడతారో మాట్లాడనివ్వండి. ప్రేమాభిమానాలకు విలువే లేదా? ఇంతేనా ఈ ప్రపంచం? ఎలాంటి లబ్ధి కోసం, ఎవరి కరుణ పొందాలని వీళ్లు ఇలా మాట్లాడుతున్నారు?” అని వ్యాఖ్యానించారు.