వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటాయనే వ్యాఖ్యలు.. రాజకీయ అంచనాలు సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “దశాబ్దం(పదేళ్లు) పాటు ఒంటరిగానే పోరాడాను. నాకు బలం సరిపోతుందనుకుంటే ఒంటరిగానైనా వెళ్తా. ఒంటరిగా వెళ్లేంత నమ్మకం మీరు ఇస్తారా?.. మీరు అండగా ఉంటానంటే.. నేను ఒంటరిగానే వెళ్తా” అని వ్యాఖ్యానించారు.
అయితే.. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మరోసారి కూడా పవన్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్లాలని అనుకుంటే.. మీరంతా అండగా నిలుస్తారా? అని పవన్ వ్యాఖ్యానించారు. కానీ, మరోసారి కూడా ప్రజల నుంచి ఈలలు తప్ప.. కామెంట్లు రాలేదు. దీంతో.. ” ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందడం అవసరం లేదు. నియంతను కలిసికట్టుగా ఎదుర్కోవాలి.” అని పవన్ పిలుపునిచ్చారు.
అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో ఓటు చీలకూడదని తాను చెబుతున్నానని.. అంటే.. అభిమానులుగా.. పార్టీ కార్యకర్తలు మీరు ఓటేసినా.. అది ఎక్కడో ఒకటో అరా కాకుండా.. అందరి ఓట్లూ కలసి కట్టుగా పడాలని కోరుకుంటున్నాను. అప్పుడే మూడు ముక్కల ముఖ్యమంత్రిని ఇంటికి పంపించే అవకాశం ఉంటుంది అని వ్యాఖ్యానించారు. అయితే.. “జనసేన పార్టీకి ఉన్న గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే కలిసి వెళ్తాం. కుదరకపోతే ఒంటరిగానైనా వెళ్తాం” అని పవన్ రణస్థలంలో స్పష్టం చేశారు. అంటే.. మొత్తానికి పొత్తుపై పవన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే వ్యవహరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates