ఒక్కోసారి అంతే. ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు. కాలం కలిసి రాదు కూడా. అలాంటిది టైం లెక్క మారితే చాలు.. అలా అన్ని ఒకటి తర్వాత ఒకటి చొప్పున కలిసి వస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే సీఎం మీద టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు.. పార్టీకి చెందిన పలువురు తమ ఆగ్రహాన్ని.. ఆవేశాన్ని వ్యక్తం చేయటం.. విమర్శలతో విరుచుకుపడటం తెలిసిందే.
సాధారణంగా కొత్తగా అధికారాన్నిచేపట్టిన తర్వాత కనీసం ఏడాది పాటు మౌనంగా ఉండటం.. ఆ తర్వాత నుంచి నెమ్మదిగా ప్రభుత్వ విధానాలపై విమర్శల్ని ఎక్కుపెట్టి.. ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసేలా కార్యక్రమాల్ని చేపడుతుంటారు. అందుకు భిన్నంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్తంత వ్యవధి ఇవ్వకుండానే.. తెలుగుదేశం పార్టీ దాడిని మొదలు పెట్టినట్లుగా విమర్శలు వెల్లువెత్తాయి. ఒకదశలో చంద్రబాబు తీరును పలువురు తప్పు పట్టారు కూడా.
ఎన్నికల వేళ ప్రజలు అంత క్లియర్ గా తీర్పు ఇచ్చి.. ముఖం మీదనే విషయాన్ని చెప్పేసిన తర్వాత కూడా గమ్మున ఉండకుండా ఇలా మాట్లాడతారేంటి? అన్న మాట పలువురి నోట వినిపించింది. అయితే.. తాము మాట్లాడలేదని.. తమ చేత మాట్లాడేలా చేసింది జగన్ విధానాలు.. జగన్ తీసుకున్న నిర్ణయాలే అన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయటంలో ఇటీవల కాలంలో చంద్రబాబు సక్సెస్ అవుతున్నారు.
మూడున్నరేళ్లుగా చూస్తున్న జగన్ సర్కారు తీసుకుంటున్న వరుస నిర్ణయాల్ని చూసినోళ్లను.. చంద్రబాబు పదవి మీద ఉన్న కాంక్ష కంటే కూడా నిత్యం ఏదో యాంగిల్ లో కెలికే జగన్ తీరే.. విపక్షాలు విరుచుకుపడేలా చేస్తున్నాయన్న భావన అంతకంతకూ ఎక్కువైన పరిస్థితి.
ఇలాంటివేళ.. జగన్ తీరును ఒక్కటంటే.. ఒక్క లైనులో చెప్పే పంచ్ మాట ఒకటి తయారు చేయాలన్న కోరిక తెలుగు తమ్ముళ్లలో చాలా ఎక్కువగా కనిపించేది. ప్రచార వ్యూహకర్తల మీద కూడా దానికి సంబంధించిన ఒత్తిడి తీవ్రంగా ఉండేది. ఇందులో భాగంగా ఎంత ప్రయత్నించినా కూడా.. 2019 ఎన్నికలకు కాస్త ముందు వైసీపీ వ్యూహకర్తలు సిద్ధం చేసిన.. ‘రావాలి జగన్ కావాలి జగన్’ మాదిరి తెలుగుదేశం కూడా ఒక పంచ్ లైన్ నుసిద్ధం చేయాలన్న డిమాండ్ పెరిగింది.
దీని కోసం భారీ ఎత్తున సాగిన కసరత్తుకు శుభం కార్డు పడినట్లేనని చెబుతున్నారు. తాజాగా టీడీపీ మొదలు పెట్టిన పంచ్ లైన్ కు విపరీతమైన ఆదరణ లభించటమే కాదు.. ఆ సింఫుల్ లైన్ ఇప్పుడు కేక పంచ్ మాదిరి మారిందన్న మాట వినిపిస్తోంది. సైకో పోవాలి.. సైకిల్ రావాలన్న సింఫుల్ మాటతో తాము చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేసినట్లు అవుతుందన్న మాట వినిపిస్తోంది.
మూడున్నరేళ్ల పాటు టీడీపీ నేతలు.. కార్యకర్తల మీద జరిగిన దాడులు.. హత్యలు.. విధ్వంసాలు.. ఆరాచకాలకు.. దౌర్జన్యాలకు సంబంధించి ఒకే ఒక్క లైన్ లో చెప్పేసేలా సిద్ధం చేసిన ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అన్న మాట తెలుగు తమ్ముళ్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజా నినాదం తమ పాలిట ఆయుధంగా మారుతుందంటున్నారు.
ఇటీవల కాలంలో టీడీపీ పట్ల సానుకూలత పెరుగుతుందని.. పవన్ కల్యాణ్ సైతం టీడీపీతో కలిసి నడిచేందుకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన సానుకూల వేళలో తాజా పంచ్ లైన్ తెలుగు తమ్ముళ్లకు ఒక అస్త్రంగా మారిందన్న మాట వినిపిస్తోంది. ఈ పంచ్ లైన్ ను వాట్సాప్.. సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ద ఎత్తున షేర్ కావటం చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఈ పదం ఏపీ రాజకీయాల్ని ప్రభావితం చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.