తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లి రావడంతో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఆయన అధ్యక్ష పీఠం కదులుతోందని వ్యతిరేకులు ప్రచారం చేస్తుంటే… మోదీ కేబినెట్‌లో ఆయనకు బెర్త్ కన్ఫర్మ్ అయింది, అందుకే పిలుపు వచ్చిందంటూ ఇంకొందరు చెప్తున్నారు. మొత్తానికి తెలంగాణకు సంబంధించి బీజేపీలో ఏదో మార్పు అయితే జరగబోతోందన్నది అంతటా వినిపిస్తోంది. అది ఎవరికి అనుకూలం… ఎవరికి ప్రతికూలం అనేది మాత్రమే తెలియాల్సి ఉంది.
మరోవైపు జనవరి 19న ప్రధాని మోదీ హైదరాబాద్ రావాల్సి ఉండగా ఆయన పర్యటనా వాయిదా పడింది. అయితే, జనవరి 28న అమిత్ షా తెలంగాణ పర్యటన మాత్రం యథావిధంగా జరగనుంది.
ఢిల్లీలో జనవరి 16, 17 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాలకు ముందు బండికి పిలుపురావడంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. జాతీయ కార్యవర్గ సమావేశాలకు జాతీయ, రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్స్ ఎలాగూ హాజరుకావాల్సి ఉంటుంది… అంటే బండి సంజయ్ ఈ మీటింగ్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ, అంతకుముందే ఆయనకు ఢిల్లీ నుంచి ఎందుకు పిలుపు వచ్చిందన్నది సస్పెన్స్‌గా మారింది.
మరోవైపు జనవరి 20తో ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం పూర్తవుతుంది.. కానీ, ఆయన పదవీకాలం మరో ఏడాది పొడిగిస్తూ ఈ సమావేశాల్లో నిర్ణయిస్తారని తెలుస్తోంది. అలాగే.. 2023లో ఎన్నికలు జరగాల్సిన 9 రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలపై ప్రత్యేకంగా ఈ సమావేశాలలో చర్చిస్తారు. అందులో భాగంగా తెలంగాణపైనా ప్రత్యేక చర్చ ఉండనుంది. దానికి సంబంధించి మాట్లాడేందుకే ఆయన్ను పిలిచినట్లుగా బీజేపీ ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates