జగనన్న లెక్క అట్లుంటది

ఏపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిపై ఉద్యోగులు ర‌గిలిపోతున్నారు. ఒక‌వైపు సంక్రాంతి పండుగ వ‌చ్చే సింది. ఇంటిల్లిపాదీ పండ‌గ సంబ‌రాల‌కు రెడీ అయ్యారు. అయితే.. నెల మొత్తం ప‌నిచేసిన ఉద్యోగులు మాత్రం జీతం కోసం వేచి చూస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వ‌చ్చేసినా ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ ప్ర‌భుత్వం 30 శాతం మంది ఉద్యోగుల‌కు మాత్ర‌మే వేత‌నాలు ఇచ్చింది.

అది కూడా సీమ ప్రాంతానికే మెజారిటీగా ద‌క్కాయ‌ని తెలుస్తోంది. ఇక‌, మిగిలిన ప్రాంతాల్లో ఉద్యోగుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు వేత‌నాలు ప‌డ‌లేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర అస‌హ‌నం, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పోనీ.. ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవేమో.. అనుకుని స‌రిపెట్టుకుందామ‌ని అనుకున్నా.. అలా ఏమీ క‌నిపించ లేదు. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం కింద ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను అందించారు.

ఏపీలోని చిరు వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తీసుకొచ్చిన ‘జగనన్న తోడు’ పథకం కింద ఆరోవిడతగా 3.95 లక్షల మందికి రూ.395 కోట్ల వడ్డీలేని రుణాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా బటన్ నొక్కి విడుదల చేశారు. రాష్ట్రంలోని అక్కా చెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లకు తోడుగా ఉంటూ వారికి రూ.10వేల చొప్పున వడ్డీలేని రుణాలకు శ్రీకారం చుట్టామ‌ని ఈ సంద‌ర్భంగా సీఎం చెప్పారు.

అయితే.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న ఉద్యోగులు.. ఇదేం ఖ‌ర్మ‌ నెల రోజులు పూర్తిగా సెల‌వు కూడా పెట్ట‌కుండా.. ప‌నిచేసిన త‌మ‌కు వేత‌నాలు స‌కాలంలో ఇవ్వ‌కుండా.. ఇలా.. తోడు ప‌థ‌కానికి ఇవ్వ‌డం ఏంట‌ని నిల‌దీస్తున్నారు. ఈ ప‌థ‌కానికి మ‌రికొన్ని రోజులు వెయిట్ చేస్తే.. పోయేదేంటి? అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. ముందు త‌న వేత‌నాలు ఇచ్చాక ఏం చేసుకున్నా.. త‌మ‌కు ఇబ్బంది లేద‌ని.. వ‌గ‌రుస్తున్నారు. కానీ, ప‌ట్టించుకునేవారేరీ?!