సంక్రాంతి సందర్భంగా భారీ అంచనాలతో విడుదలకు రెడీ అయిన రెండు సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం రాజకీయ కోణంలో నిర్ణయం తీసుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నటసింహం బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల కానున్నాయి. అయితే.. రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్సినిమాలే కావడం గమనార్హం.
అయితే.. ఈ రెండు చిత్రాల నిర్మాతలు కూడా.. ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. తమ సినిమాలకు.. ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో రూ.150 నుంచి 100 వరకు పెంచుకునే అవకాశం ఉందని.. దీనిని పునరుద్ధరించాలని వారు అభ్యర్థించారు. అయితే.. ఏపీ ప్రభుత్వం మాత్రం తనదైన శైలిలో ఈ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంది.
బాలయ్య నటించిన సినిమా వీరసింహారెడ్డికి రూ.20 పెంచుకునేలా అవకాశం కల్పించిన ప్రభుత్వం అదేసమయంలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు రూ.25 పెంచుకునేందుకు ఛాన్స్ కల్పించింది. వాస్తవానికి రెండూ హై బడ్జెట్ సినిమాలే అయినప్పుడు ఇంత తక్కువగా ధరలు పెంచడం.. అది కూడా ఒక్కొక్క సినిమాకు వేరియేషన్ కూడా చూపించడం.. రాజకీయ ఎత్తుగడలో భాగమేనని అంటున్నారు పరిశీలకులు.
ఇదిలావుంటే.. ఈ పెంపు కూడా కేవలం పది రోజుల వరకు మాత్రమే పరిమితమని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలావుంటే, తెలంగాణ ప్రభుత్వం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు సినిమాలకు రూ.100 వరకు పెంచుకునే అవకాశం ఇవ్వడంతోపాటు.. ఒక ప్రత్యేక షో వేసుకునేందుకు అనుమతినిచ్చింది.