‘చంద్రబాబు కాదు ఆయన్ను ఓడించి తీరండి’

‘చంద్రబాబును ఓడించడానికి ట్రై చేయండి.. ఆయన్ను మాత్రం ఓడించి తీరండి’.. జగన్ నోటి నుంచి వచ్చినట్లుగా చెప్తున్న ఈ మాట ఎవరి గురించో తెలుసా?
పవన్ కళ్యాణ్ గురించి అనుకుంటున్నారా? కానే కాదు.

ఈ మాట చింతకాయల అయ్యన్నపాత్రుడి గురించి. అవును.. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడి గురించి జగన్ ఈ మాట అన్నట్లుగా వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. అయ్యన్నపాత్రుడిని 2019 ఎన్నికల్లో వైసీపీ ఓడించినప్పటికీ ఈసారి కూడా ఆయనకు గెలిచే చాన్స్ ఇవ్వరాదని, ఎలాగైనా ఓడించాలని జగన్ అన్నట్లుగా చెప్తున్నారు.

కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా ఓడిస్తామని వైసీపీ నేతలు పదేపదే చెప్తున్నా.. అంతకంటే కూడా అయ్యన్నపాత్రుడి ఓటమి ఇంపార్టెంట్ అని జగన్ అనుకుంటున్నారట. జగన్ ఇంతలా అనుకోవడానికి కారణాలున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు, ఇతర ముఖ్యనాయకుల కంటే చింతకాయల అయ్యన్నపాత్రుడు నేరుగా సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని చేసే విమర్శలు, వేసే సెటైర్లు తూటాల్లో దిగుతుంటాయి.

ఒక్కోసారి ఆయన నవ్వు పుట్టించే సెటైర్లతో విమర్శించడమే కాకుండా రాయడానికి వీల్లేని దురుసైన పదజాలంతోనూ విరుచుకుపడిన సందర్భాలున్నాయి. ఇవన్నీ జగన్‌ను నేరుగా తాకినట్లు చెప్తున్నారు. అందుకే ఆయన అయ్యన్నపాత్రుడిని ఎలాగైనా ఓడించాలని వ్యూహం రచిస్తున్నట్లుగా చెప్తున్నారు.

2019 ఎన్నికల్లో చింతకాయల అయ్యన్యపాత్రుడిపై వైసీపీ నేత పెట్ల ఉమాశంకర్ గణేశ్ గెలిచారు. సుమారు 34 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఆయన గెలిచారు. వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో సీట్లు గెలవడంతో జగన్ సీఎం అయ్యారు. జగన్ సీఎం అయిన తరువాత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒక ప్రకటన చేశారు. ఆర్నెళ్ల పాటు జగన్ పాలన చూస్తానని, పాలన బాగుంటే ఏమీఅననని… బాగులేకుంటే మాత్రం విమర్శలు తప్పవని చెప్పారు.

అన్నట్లుగానే ఆర్నెళ్ల తరువాత నుంచి ఆయన జగన్ ప్రభుత్వం, జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం ప్రారంభించారు. ఒక్క నర్సీపట్నానికే పరిమితం కాకుండా సందర్భానుసారం రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలు తిరుగుతూ జగన్‌పై ఆయన విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయనపై 10కి పైగా కేసులు పెట్టారు కూడా. అయితే… అన్ని కేసుల్లోనూ ఆయన బెయిల్ తెచ్చుకుని బయటే ఉంటూ మరిన్ని ఆరోపణలు చేస్తున్నారు.

అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూడా కూల్చారు. అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ టీడీపీ సోషల్ మీడియాను నడిపిస్తున్నారని.. జగన్‌పై విమర్శలు చేయిస్తున్నారన్న అభియోగాలతో ఆయనపైనా కేసులు పెట్టారు.

అయినా అయ్యన్న మాత్రం వెనక్కు తగ్గకుండా ఎప్పటిలాగే తన దూకుడు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయ్యన్నను ఎలాగైనా ఓడించాలని జగన్ వైసీపీ నేతలకు సూచించారట.
కానీ నర్సీపట్నంలో గత ఎన్నికల్లో అయ్యన్నపై గెలిచిన ఉమాశంకర్ మాత్రం ఈసారి గెలిచే పరిస్థితులు కనిపించకపోవడంతో ఆయన్ను మార్చేందుకు జగన్ చూస్తున్నారని తెలుస్తోంది.

నర్సీపట్నం వైసీపీలో గ్రూపులు ఉండడం.. ఆ సమస్యను ఉమాశంకర్ పరిష్కరించలేకపోవడంతో పాటు ప్రజల్లోనూ ఆయనపై వ్యతిరేకత వచ్చిందని చెప్తున్నారు. ఇవన్నీ అయ్యన్నకు కలిసొచ్చే అంశాలని.. ఆయన ఈసారి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఎలాగైనా ఓడించాలని జగన్ సూచిస్తున్నట్లు చెప్తున్నారు.

ఈ క్రమంలో అయ్యన్నను ఓడించాలంటే టీడీపీ నుంచే అభ్యర్థిని తీసుకొచ్చి ఆయనపై పోటీలో నిలపాలని జగన్ భావిస్తున్నారట. నర్సీపట్నం నుంచి అయ్యన్న ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమాశంకర్ 2014లో అయ్యన్న చేతిలో ఓడిపోయారు. 2019లో జగన్ హవాలో ఆయన అయ్యన్నపై గెలిచారు.