తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సంచలన నివేదిక అందిందా? ఆయన ఎట్టి పరిస్థితిలోనూ ఈ నివేదికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారా? అంటే.. ఔననే అంటున్నాయి ప్రగతి భవన్ వర్గాలు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత.. పెద్ద ఎత్తున జోష్ కనిపిస్తుందని, ఇది తనకు, పార్టీకి మేలు చేస్తుందని కేసీఆర్ అనుకున్నారు. అయితే.. తన చుట్టూనే జాతీయ రాజకీయాలు తిరుగుతున్నాయి తప్ప.. నియోజకవర్గాల్లో సందడి కనిపించడం లేదు.
ఈ పరిణామాలను గమనించిన కేసీఆర్.. అసలు నియోజకవర్గాల్లో ఏం జరుగుతోందనే విషయంపై రహస్య సమాచారం సేకరించినట్టు సమాచారం. ఈ సమాచారంలో పార్టీనేతలపై.. తీవ్ర విమర్శలు, వారు చేస్తున్న రహస్య రాజకీయాలు కూడా తేటతెల్లం అయినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. వారికి టికెట్ లు ఇచ్చారు. వారు గెలిచారు.
అయితే.. తర్వాత.. ఆయా పార్టీలు పుంజుకుంటున్న పరిస్థితిలో వీరంతా ఎందుకైనా మంచిదని ఆయా పార్టీలతో తెరచాటు మంత్రాంగాలు నడుపుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇలాంటి వాటిపై తనకు అందిన సమాచారం ఆధారంగా కేసీఆర్.. చర్యలు తీసుకోవడం ఖాయమని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి గతం నుంచి కూడా చాలా మంది నేతలపై కేసీఆర్‌కు అనుమానం ఉంది.
అయినప్పటికీ.. అందరికీ టికెట్లు ఇస్తామని ఆయన ప్రకటించి.. వారిని సరిదిద్దే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. నాయకులు చాలా మంది ఇప్పటికీ రెండు పడవలపై కాళ్లేసినట్టు వ్యవహరిస్తుండడం.. పార్టీ కార్యక్రమాలకు కూడా మొక్కుబడిగా హాజరు అవుతుండడం.. బీఆర్ ఎస్ పార్టీకి తగిన విదంగా ప్రచారం కల్పించకపోవడం వెనుక.. కీలకమైన పార్టీల ప్రభావం పడుతోందని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేసీఆర్.. సదరు ఎక్వైరీకి ఆదేశించారని.. ప్రస్తుతం నివేదిక కూడా చేరిందని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates