పోరంబోకు రాజకీయాలు చేయనన్న వసంత !

జనసేన అధినేత పవన్ కల్యాన్ నోటి నుంచి తరచూ ఒక మాట వస్తూ ఉంటుంది. తనకు వ్యక్తిగతంగా వైసీపీకి చెందిన అందరి నేతలతో ఎలాంటి పంచాయితీలు లేవని.. ఆ మాటకు వస్తే ఆ పార్టీలోని కొందరు నేతలంటే తనకు ఇష్టమని.. అభిమానిస్తానని చెప్పటం తెలిసిందే. నిజానికి ఇలాంటి వ్యాఖ్యలు చేసే అధినేతలు చాలా అరుదుగా ఉంటారని చెప్పాలి. సమకాలీన రాజకీయాల్లో రాజకీయం అంటేనే వ్యక్తిగత కక్షలతోనూ.. వైరంతో కూడుకున్నవన్నట్లుగా వ్యవహరించే దానికి భిన్నంగా పవన్ లాంటి వారు చాలా తక్కువగా కనిపిస్తారు. ఆ మాటకు వస్తే.. పవన్ చెప్పింది నిజమే.

వైసీపీలో పలువురు నేతల్ని చాలామంది వ్యతిరేకించొచ్చు. అదే సమయంలో మరికొందరు నేతలు (వీరి సంఖ్య చాలా తక్కువన్న మాట వినిపిస్తూ ఉంటుంది) ఉంటారు. వారిని పార్టీలకు అతీతంగా అభిమానించి.. ప్రేమించేవారుంటారు.

ఆ మధ్యన హటాత్తుగా మరణించిన మేకపాటి గౌతమ్ రెడ్డి వాళ్లు కావొచ్చు.. ఇప్పుడు ఎలాంటి పదవి లేకున్నా.. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరున్న బాలినేని లాంటి వారితో పాటు.. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లాంటి వారు రోటీన్ కు భిన్నమైన నేతలుగా చెప్పొచ్చు. తమ రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించిన ఏ చిన్న అవకాశం చిక్కినా.. వారి లెక్కలు తేల్చే ధోరణి గతంలో ఉండేది.

ఇప్పుడు అలాంటిదేమీ లేకుండా మనసుకు అనిపించటం ఆలస్యం.. వారి అంతు చూసే వరకు తగ్గని అతి ధోరణి వైసీపీ సర్కారులో కనిపిస్తుందన్న విమర్శ ఈ మధ్యన ఎక్కువైన పరిస్థితి.

అయితే.. పార్టీలో పలువురు ఇలాంటి ధోరణితో ఉన్నా.. వసంత కృష్ణ ప్రసాద్ లాంటి వారు మాత్రం కాస్త భిన్నంగా ఉంటారు. మొన్నటికి మొన్న గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమంలో తొక్కిసలాట జరగటం.. ఈ కార్యక్రమంలో విపక్ష నేత చంద్రబాబు పాల్గొన్న నేపథ్యంలో.. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న జగన్ సర్కారు.. ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీనివాస్ ను అరెస్టు చేసే వరకు పోలీసులు నిద్ర పోని తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి కొనసాగింపుగా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు.

శ్రీనివాస్ తన స్నేహితుడని.. జీవితంలో కష్టపడి పైకి వచ్చాడని.. సేవా కార్యక్రమాల్ని చేసే వారిని వేధింపులకు గురి చేస్తే భవిష్యత్తులో ఎవరూ సేవ చేయటానికి ముందుకు రారన్న ఆయన మాటలు జగన్ సర్కారును ఇరుకున పడేలా చేశాయి. ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న పరిణామాలపై రాజకీయ కక్షలు ఏ మాత్రం సరికాదని విమర్శించటం ఏపీ అధికార పార్టీలో కలకలాన్ని రేపింది. ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న మంత్రి జోగి రమేశ్ వర్గం వసంతపై వ్యతిరేక ప్రచారాన్ని చేయటం పెరిగినట్లుగా చెబుతున్నారు.

మంత్రి జోగి రమేశ్ కు.. ఎమ్మెల్యే వసంతకు మధ్య ఉన్న పంచాయితీ గురించి తెలిసిందే. వీరిద్దరి మధ్య విభేధాల్ని తీర్చేందుకు సీఎం జగన్ సైతం నడుం బిగించాల్సి రావటం తెలిసిందే. ఓవైపు తనకు వ్యతిరేకంగా నిలుస్తున్న మంత్రి.. మరోవైపు పార్టీ తీరు.. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన గుర్రుగా ఉండటం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత సంచలనంగా మారాయి. తాను పాతతరం నేతగా అభివర్ణించిన ఆయన.. తాను పోరంబోకు రాజకీయాలు చేయలేనని వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షాలపై అనవసరంగా తప్పుడు కేసులు బనాయించటం తన వల్ల కాదన్న ఆయన.. పది మంది పోరంబోకుల్ని వెంటేసుకొని తిరిగే రాజకీయాలు తాను చేయలేనన్నారు. ‘పోరంబోకుల్లా మనం ప్రవర్తిస్తేనే ఇప్పటి రాజకీయాల్లో నిలబడగలమని అంటున్నారు. ఇప్పుడు పెద్దరికం పనికిరాదంటున్నారు. అందుకే పాతతరం నాయకుడిగా మిగిలిపోయా. మా తండ్రి వసంత నాగేశ్వరరావు కాలం నాటి రాజకీయాలు ఇప్పుడు లేవు. ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు బనాయించను. దీనిపై పార్టీలో కొందరికి నాపై అసంతృప్తిగా ఉంది. నేను పుట్టినప్పటి నుంచి మా తండ్రి రాజకీయాల్లోనే ఉన్నారు. 55 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయం చేస్తోంది. మూడున్నరేళ్లలో నేనెక్కడా అక్రమ కేసులు పెట్టించలేదు. ఒక్కోసారి రాజకీయాల్లో ఎందుకు వచ్చానా? అని బాధ పడుతున్నా. సగటు వ్యక్తులకు కొన్నిసార్లు సాయం చేయలేకపోతున్నా’ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.