ఎన్నికల వాతావరణం దాదాపు వచ్చేసింది. ఇక, ఇప్పుడు రాష్ట్రంలో వ్యూహాత్మకంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అయితే.. ఈ మార్పులకు, చేర్పులకు, రాజకీయ వ్యూహాలకు కూడా చంద్రబాబు నాయ కుడు కానున్నారనే చర్చ నడుస్తోంది. త్వరలోనే కమ్యూనిస్టులు కూడా చంద్రబాబుతో భేటీ అవుతున్నా రు. ఇప్పటికే జనసేన-టీడీపీ ఒక అవగాహనా ఒప్పందానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజకీయం పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
మొత్తానికి ఇప్పటి వరకు ఉన్న ఒక అలజడి వాతావరణం నుంచి ఏపీ ఒక వ్యూహాత్మక రాజకీయం వైపు అడుగులు వేస్తుండడంతో.. ప్రభుత్వ పక్షానికి సహజంగానే ఇబ్బందికర పరిణామాలు ప్రారంభమయ్యాయని చెప్పాలి. నిజానికి ఒంటరి పోరుతో గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న జగన్.. ఇప్పుడు.. కూడా ఒంటరిగానే పోరుబాట పట్టాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు మూకుమ్మడిగా రంగంలోకి దిగుతున్నాయి.
పైగా.. చంద్రబాబు వంటి రాజకీయ వ్యూహకర్త, విజన్ ఉన్న నాయకుడు ఇప్పుడు ఈ కూటమి రాజకీయా లకు నేతృత్వం వహించడం మరింత ఆసక్తిగా మారింది. ఇప్పుడు ఎవరికి ఎలాంటి డిమాండ్లు లేవు. కేవలం తమను కూటమిలో చేర్చుకుంటే చాలు.. అన్నట్టుగా ఉంది పరిస్థితి. కమ్యూనిస్టులు, బీఎస్పీ నాయకులు.. ఇతర పార్టీల వారు కూడా ఈ కూటమిలో చేరేందుకు రెడీ అవుతున్నారనేది టీడీపీ నేతల మాట.
మరోవైపు.. వీరిని ముందుకు నడిపించడమే కాకుండా.. వీరికి ఎన్ని సీట్లు కేటాయించాలి. ఏయే సీట్లు ఇవ్వాలనేది చంద్రబాబు ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా.. నడిపించేది బాబేనని తేలిపోయింది. దీనిలో ఎవరికీ ఎలాంటి ప్రత్యేక అనుమానాలు కూడా అవసరం లేదని చెబుతున్నారు. మొత్తానికి బాబు ఒకప్పుడు జాతీయ వ్యూహం వేస్తే.. ఇప్పుడు.. రాష్ట్ర వ్యూహం వేస్తున్నారన్న మాట.