తెలంగాణకు కొత్త గవర్నర్.. తమిళిసై మహారాష్ట్రకు..

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను మార్చనున్నారని బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. గవర్నరు పనితీరుపై కానీ, ఆమె శక్తి సామర్థ్యాలపై కానీ బీజేపీ అధిష్ఠానానికి ఎలాంటి అసంతృప్తి లేనప్పటికీ గత మూడేళ్లుగా ఆమె తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నుంచి తగిన గౌరవం పొందలేకపోతుండడంతో.. ఇంకా ఆమెను అవమానాలు పడనివ్వరాదన్న ఉద్దేశంతో వేరే రాష్ట్రానికి మార్చనున్నట్లు సమాచారం.

కేసీఆర్ ప్రభుత్వం ఆమె విషయంలో ప్రోటోకాల్ పాటించలేదన్న ఆరోపణలున్నాయి. దీనిపై ఆమె అనేకసార్లు అసంతృప్తి వ్యక్తంచేశారు. కేసీఆర్‌కు ఆమెను నిర్లక్ష్యం చేయడంతో యథా రాజా తథా అధికారులు అన్నట్లుగా తెలంగాణలోని అధికారులూ అనేకసందర్భాలలో ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. కేంద్రంతో బీఆర్ఎస్ రాజకీయ కయ్యాలతో పాటు గవర్నర్ తమిళిసై కూడా ధీటుగా కొన్ని విషయాల్లో వ్యవహరించడంతో కేసీఆర్ ఆమె పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్తారు.

వీటన్నిటి నేపథ్యంలో కేంద్రం ఆమెను మహారాష్ట్రకు మార్చాలనకుంటున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ ఖోషియారీ తనను బాధ్యతల నుంచి తప్పించాలని.. తాను పబ్లిక్ లైఫ్ నుంచి తప్పుకుని ప్రశాంత జీవితం గడపాలని అనుకుంటున్నానని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయనకు విశ్రాంతి ఇచ్చి ఆ స్థానంలో తమిళిసైను నియమించే అవకాశాలున్నాయి. మహారాష్ట్రలోనూ రాజకీయంగా కేంద్రంతో విభేదించే సర్కారే ఉన్నప్పటికీ తెలంగాణలో ఉన్నలాంటి పరిస్థితులు లేకపోవడంతో తమిళిసైను అక్కడికి మార్చాలనుకుంటున్నారట.

దీంతో తెలంగాణకు కొత్తగా ఎవరిని గవర్నరుగా పంపిస్తారన్నదీ ఆసక్తికరంగా మారింది. ఉత్తరాదికి చెందిన నేతలను పంపిస్తారా.. లేదంటే తమిళిసై మాదిరిగానే దక్షిణాదికి చెందిన బీజేపీ నేతలను పంపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

అదే సమయంలో అస్సాం గవర్నర్ పదవీకాలం ముగుస్తుండడంతో తమిళిసైను అక్కడికి పంపించే అవకాశాలూ ఉన్నాయి. అస్సాంలో బీజేపీ ప్రభుత్వమే ఉండడంతో గవర్నరుకు అత్యున్నత స్థాయిలో గౌరవం దొరకనుంది.