తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం.. అనేక విశ్లేషణలు తెరమీదికి వచ్చాయి. ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తున్నాయని, వచ్చే ఎన్నికలకు సంబంధించి పవన్ 30 సీట్లు అడిగారని.. పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వీటిలో 24 స్థానాలకు సంబంధించి కూడా కొన్ని పేర్లు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ఇదే నిజమైతే.. అసలు ఆయా స్థానాలను టీడీపీ కేటాయించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనేది ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నియోజకవర్గాల విషయానికి వస్తే..(అంటే వీటిని టీడీపీ జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్ననేపథ్యంలో) విశాఖ నార్త్, చోడవరం, గాజువాక, భీమిలి, యలమంచిలి, రాజానగరం, అమలాపురం, రాజోలు, కాకినాడ రూరల్, భీమవరం, నరసాపురం, తాడేపల్లి గూడెం, కైకలూరు, విజయవాడ పశ్చిమ, తెనాలి, సత్తెనపల్లి, గుంటూరు పశ్చిమ, పుట్టపర్తి , గిద్దలూరు, చీరాల, చిత్తూరు, తిరుపతి, దర్శి, అనంతపురం అర్బన్ నియోజకవర్గాలను జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
అయితే.. వీటిలో మెజారిటీ స్థానాల్లో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. రాజానగరం, అమలాపురం, రాజోలు, కాకినాడ రూరల్, నరసాపురం, తాడేపల్లిగూడెం, కైకలూరు, విజయవాడ పశ్చిమ, సత్తెనపల్లి, గుంటూరు పశ్చిమ, పుట్టపర్తి,గిద్దలూరు, చీరాల, తిరుపతి, దర్శి నియోజకవర్గాల్లో టీడీపీకి అభ్యర్థులు లేరు. ఉన్న చోట అంటే సత్తెనపల్లి వంటి నియోజకవర్గాల్లో ఒకరికి మించి ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. ఇక, పుట్టపర్తిలో జేసీ బ్రదర్స్ వర్సెస్ మాజీ మంత్రి రఘునాథరెడ్డి మధ్య తీవ్ర యుద్ధం నడుస్తోంది. సో.. ఇలాంటి చోట ఎవరికి టికెట్ ఇచ్చినా..తమ్ముళ్లు తన్నుకోవడమే.
ఇక, నరసాపురంలో టీడీపీ గత ఎన్నికల్లో ఓడిపోయింది. అంతేకాదు.. టీడీపీ వల్లే ఇక్కడ జనసేన ఓడిందనే టాక్ కూడా ఉంది. గాజువాకలోనూ ఇదే పరిస్థితి ఉంది. అయితే, తెనాలి, అనంతపురం అర్బన్‌లలో టీడీపీకి మెజారిటీ ఉన్నా.. దానిని మాత్రం వదులుకున్నట్టు అవుతుంది. వెరసి మొత్తంగా మిగిలిన స్థానాల్లో టీడీపీకి పట్టులేదు. దీంతో వీటిని ఏదో ఒక రకంగా వదిలించుకుంటే.. పార్టీకి తలనొప్పి తప్పినట్టు ఉంటుంది.. మిత్రపక్షానికి ఇచ్చినట్టు ఉంటుందనే భావన తమ్ముళ్లలో వ్యక్తం అవుతుండడం గమనార్హం. మరి ఏది నిజమో తేలాలంటే కొంత సమయం పట్టడం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates