‘ఈసారి నిజామాబాద్‌లో సత్తా చాటనున్న చంద్రబాబు’

ఇటు ఏపీలోనే కాదు అటు తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీ స్పీడందుకుంటోంది. ఏపీలో ప్రభుత్వ ఆంక్షలను దాటుకుని చంద్రబాబు దూకుడు చూపుతుండగా తెలంగాణలోనూ సత్తా చాటేందుకు వరుస కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంలో సభ నిర్వహించి టీడీపీ ఇంకా తెలంగాణలో సజీవంగానే ఉందనే సంకేతాలు పంపించగా ఇప్పుడు నిజామాబాద్‌లో సభ నిర్వహించి ఉత్తర తెలంగాణలోనూ ఉన్నామని చాటాలని ఉవ్విళ్లూరుతోంది.

ఖమ్మం జిల్లాలో చంద్రబాబు సభ సూపర్ సక్సెస్ కావడంతో ఇప్పుడు తెలంగాణ టీడీపీ నిజామాబాద్‌లో భారీ సభ ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు రచించింది. జనవరి చివరి వారంలో నిజామాబాద్‌లో లక్ష మందితో సభ నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టింది. త్వరలో దీనికి సంబంధించి తేదీ కూడా నిర్ణయించే అవకాశాలున్నాయి.

నిజామాబాద్ సభ విజయవంతం చేయడానికి గాను సన్నాహకంగా ఒకట్రెండు రోజుల్లో ఆ జిల్లాలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గతంలో టీడీపీ నుంచి ఇతర పార్టీలకు వెళ్లిపోయినవారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించి వారికి పదవులు, టిక్కెట్లు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఏపీలో వరుసగా కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవడంతో ఆయనతో చర్చించి తేదీలు నిర్ణయించనున్నారు.

మరోవైపు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఇప్పటికే నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కీలక నేతలతో సమావేశమయ్యారు. నిజామాబాద్ తరువాత వరంగల్, మహబూబ్‌నగర్‌లోనూ చంద్రబాబుతో భారీ సభలు ప్లాన్ చేస్తున్నట్లు కాసాని చెప్తున్నారు.

కాగా రావుల చంద్రశేఖరెడ్డి వంటి తెలంగాణకు చెందిన టీడీపీ సీనియర్లు కాసానికి అండగా ఉంటూ పార్టీని మళ్లీ బలోపేతం చేయడానికి ప్రణాళికలు రచిస్తుండడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో కంగారు మొదలవుతోంది. తెలంగాణ ఏర్పాటు తరువాత టీడీపీ నేతలు ఆ రెండు పార్టీలలోకి పెద్ద ఎత్తున చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీడీపీ మళ్లీ పుంజుకుంటే వారంతా సొంతగూటికి చేరుతారని కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు భయపడుతున్నాయి.