వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రోజురోజుకూ ఎక్కువవుతోంది. జగన్ కోసం ప్రాణాలిస్తామన్న నేతలు కూడా ఇప్పుడు ఆయనపై నోరెత్తుతున్నారు. జనం గుండె జగన్ జగన్ అంటూ కొట్టుకుంటోందని ఒకప్పుడు చెప్పిన తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి… ఇప్పుడు అదే జగన్‌పై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
తాడికొండకు తాను ఎమ్మెల్యే అయినప్పటికీ అక్కడ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడంపై ఆమె అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. వైసీపీ అనే చెట్టు నీడనే తామంతా పెరిగామని.. కానీ, ఆ చెట్టు కొమ్మలను నరికేయాలని పార్టీయే అనుకుంటే ఇంకేమీ మిగలదంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఉండవల్లి శ్రీదేవి ఈ వ్యాఖ్యలు చేయడానికి ఒక రోజు ముందు మేకతోటి సుచరిత కూడా జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. తన భర్త ఏ పార్టీలోకి వెళ్తే తాను ఆ పార్టీలోకే వెళ్తానంటూ సంకేతాలిచ్చారు. ఆమె కూడా చాలాకాలంగా అసంతృప్తిగా ఉన్నారు.
ఇక ఆనం రామనారాయణ రెడ్డి అయితే కొన్నాళ్లుగా జగన్‌పై నేరుగా బాణాలు సంధిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటూ ఎక్కడికక్కడ చెప్తున్నారు. ఒక్క అభివృద్ధి పనీ జరగలేదని ఆయన అంటున్నారు. ఆనం అసంతృప్తి చెందుతున్నప్పటికీ పార్టీ ఆయన్ను ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా ఆయన నియోజకవర్గ ఇంచార్జిగా నేదురుమల్లిని నియమించింది. దీంతో ఆనం అసంతృప్తి పదింతలైంది.
ఇక నెల్లూరు జిల్లాకే చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా పార్టీపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా పింఛన్ల తొలగింపుపై ఆయన మండిపడుతున్నారు. కానీ, జగన్ పిలిచి మాట్లాడడంతో ఆయన సైలెంటయ్యారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా వైసీపీలో మింగలేక కక్కలేక అన్నట్లుగా సాగుతున్నారు.
గిద్దలూరులో అన్నా రాంబాబు కూడా అలక మీదే ఉన్నారు. ఆయన కూడా అవకాశం దొరికినప్పుడంతా తన అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నేరుగా సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. గుంటూరులో ఎన్ఆర్ఐలు నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు చనిపోయిన ఘటనలో ఆయన మిత్రుడు ఉయ్యూరు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయడంతో కృష్ణప్రసాద్ ఆగ్రహించారు. సొంత పార్టీ, ప్రభుత్వంపై ఆగ్రహించారు.
ఇలా జిల్లాజిల్లాలో అసమ్మతి నేతలు పెరుగుతుండడంతో వైసీపీ అధిష్ఠానం పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోలోన కంగారు పడుతోంది. ముఖ్యంగా ఇంతవరకు సాఫీగా సాగిపోతున్న పరిస్థితుల్లో రాజకీయం చేయడమే తప్ప పార్టీలోనే అంతర్గత సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితిని జగన్ ఎన్నడూ డీల్ చేయలేదు. కానీ, రానున్న ఎన్నికల్లో జగన్‌కు ఇది ప్రధాన సమస్య కానుంది. ప్రత్యర్థులను ఎదుర్కోవడం ఎంత ప్రధానమో సొంత పార్టీలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం ఆయనకు అంతే ప్రధానం. లేదంటే.. వచ్చే ఎన్నికల్లో జగన్ పని కష్టమే.