కొమ్మినేనికి షాకిచ్చిన జర్నలిస్టులు…

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు‌ను సాక్షి టీవీలో చాలామంది చాలాకాలం చూసే ఉన్నారు. వారందరికీ ఆయన జర్నలిజం బాగా తెలుసు. ఆయన ‘కృషి’కి మెచ్చి వైసీపీ ప్రభుత్వం ఆయన్ను ప్రెస్ అకాడమీ చైర్మన్‌ను చేసిన విషయమూ తెలుసు. అలా మొత్తానికి ప్రభుత్వ పదవిలో కూర్చుని తన కోరిక తీర్చుకున్న కొమ్మినేని శ్రీనివాసరావు ఎప్పటిలా జగన్ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చి అంతా చంద్రబాబు వల్లే అని చెప్పడానికి ఈసారి జనంలోకి రావాల్సి వచ్చింది.

సాక్షి చానల్ డిబేట్‌లో అయితే గెస్ట్‌లు నలుగురూ వైసీపీ వాళ్లే ఉంటారు కాబట్టి ఎవరూ కొమ్మినేనిని ఇదేమని ప్రశ్నించరు.. ఒకవేళ ఎవరైనా ఫోన్‌‌ఇన్‌లో ప్రశ్నించినా… ‘హలో.. హలో… సిగ్నల్ బాగులేదు’ అంటూ కట్ చేసేస్తారు. కానీ, నేరుగా జనంలోకి వచ్చినప్పుడు .. నేరుగా మీడియాను ఎదుర్కొన్నప్పుడు అలా కాదు కదా. అదే జరిగింది కొమ్మినేని వారికి..

కొమ్మినేని శ్రీనివాసరావు ప్రెస్ అకాడమీ చైర్మన్ హోదాలో నెల్లూరు జిల్లా కందుకూరు వెళ్లారు. అక్కడ టీడీపీ సభలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ఆయన స్థానిక పోలీసులతో కలిసి వెళ్లి పరిశీలించారు. ఆ తరువాత విలేకరులతో మాట్లాడుతూ… ఇరుకు రోడ్లలో రోడ్ షో నిర్వహించడం… డ్రోన్ షాట్ల కోసం జనాన్ని పోగుచేయడం వల్లే తొక్కిసలాట జరిగింది కానీ పోలీసుల వైఫల్యమేమీ లేదని… మీడియాలో అన్నీ అసత్యాలు రాస్తున్నారని ఆరోపించారు. కందుకూరు, గుంటూరు తొక్కిసలాటల గురించి కొన్ని పత్రికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన వార్తలలో అభ్యంతరకర పదాలున్నాయని… జర్నలిజం పేరుతో అలాంటి తప్పుడు రాతలు రాయరాదని… నేరుగా ఆయా పార్టీల్లో చేరాలే కానీ జర్నలిజం పేరుతో ఇలా ఒక పార్టీకి కొమ్ము కాయకూడదని ఆయన అన్నారు.

దీంతో విలేకరులు ఆయన్ను ఆడుకున్నారు. ఆయన మాటలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. మీరు జర్నలిస్టుగా వైసీపీకి కొమ్ము కాయలేదా అని ప్రశ్నించారు. కొమ్ముకాయడంలో నిన్ను మించినవారు ఎవరూ లేరు కొమ్మినేనీ అంటూ జర్నలిస్టులలో ఒకరు నేరుగా ఆయన ముఖానే అన్నారట. ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ఏం చేశారో చెప్పాలని అడిగారు. అక్రిడేషన్లు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలంటూ ప్రశ్నించారు. కోవిడ్ సమయంలో ఎంతమందిని ఆదుకున్నారో అడిగారు. ఇలా ప్రశ్నలతో ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో ఆయనకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా ప్రశ్నల వర్షం ఎదురయ్యేటప్పటికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అసలు మిమ్మల్నెవరు పిలిచారంటూ జర్నలిస్టులపై ఎదురుదాడికి యత్నించారు. దానికీ వారు సమాధానం చెప్పడంతో ఏమీ చేయలేక… ‘నాకేమీ చేతకాదు’ అంటూ కొమ్మినేని అక్కడి నుంచి వెళ్లిపోయారు.