కొత్త సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం కొత్తకొత్తగా తీసుకువచ్చిన జీవో 1/2023 ప్రతిపక్షాలకు చుక్కలు చూపి స్తోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనను.. ఈ జీవో ఆధారంగానే పోలీసులు అడుగడుగునా.. అడ్డుకున్నారనేది వాస్తవం.
రోడ్డు షో నిర్వహించరాదని, రోడ్లపై సభలు పెట్టరాదని.. రోడ్లపై ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని… ఇలా ఈ జీవో అనేక కారణాలతో రాజకీయ నేతల దూకుడుకు ముకుతాడు వేసే ప్రయత్నం చేసింది.
ఓకే.. ప్రభుత్వం చెబుతున్నట్టు.. ప్రజల ప్రాణాలను దృష్టిపెట్టుకునే దీనిని తెచ్చామని అంటున్న వాస్తవా న్ని అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. అయితే, ఇదే సమయంలో అయినవారికి ఒక విధంగా కాని వారికి మరో విధంగా ఈ జీవో-1/2023 అమలు చేయడం ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది.
ఒక వైపు కుప్పంలో చంద్రబాబు పర్యటనకు ఏ జీవో అయితే.. రీజన్ అని పోలీసులు చెబుతున్నారో.. మరి అదే జీవోను గుంటూరు జిల్లా మాచర్లలో తుంగలో తొక్కడం.. దేనికి సంకేతమని ప్రజాస్వామ్య వాదులు ప్రశ్నిస్తున్నారు.
ఏం జరిగింది?
రోడ్షోలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తెచ్చిన నిబంధనలు పల్నాడు జిల్లాలో అమలు కాలేదు. మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ ముఖ్య నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రోడ్ షోను పోలీసులు దగ్గరుండి మరీ నడిపించారు. మాచర్ల మండలం బైరవునిపాడులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి రోడ్షో నిర్వహించారు.
మాచర్లలో ఇటీవల జరిగిన ఘర్షణల నేపథ్యంలో నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్‌షోలు నిర్వహంచడంపై నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు వైసీపీకు వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.