మారిన గేమ్ ప్లాన్.. టీడీపీ ఎదురుదాడి

టీడీపీ గేమ్ ప్లాన్ మార్చింది. అఫెన్స్ ఈజ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ డిఫెన్స్ అన్న నిర్ణయానికి వచ్చింది. తొక్కిసలాట సంఘటనలను తొలుత దుర్ఘటనలుగా భావించిన టీడీపీ ఇప్పుడు అసలు సంగతి అర్థం చేసుకుని డైరెక్టుగా వైసీపీని అటాక్ చేస్తోంది..

చంద్రబాబు నాయుడు కందుకూరు రోడ్ షోలో ఎనిమిది మంది చనిపోయారు. తక్షణమే స్పందించిన టీడీపీ అధినేత బాధిత కుటుంబాలను పరామర్శించడంతో పాటు భారీగా ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇలాంటి సంఘటన జరిగి ఉండకూడదని ఆవేదన చెందారు. జనాన్ని వారించేందుకు ప్రయత్నించే లోపే ప్రమాదం జరిగిపోయిందనుకున్నారు.

తర్వాత రెండు రోజులకే గుంటూరులో మరో సంఘటన జరిగింది. ఉయ్యూరు శ్రీనివాస్ ఏర్పాటు చేసిన సంక్రాంతి కానుకల కార్యక్రమానికి చంద్రబాబు హాజరై వెళ్లిపోయిన కాసేపటికే తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు ప్రాణాలు వదిలారు. రెండో ఘటన తర్వాత జరుగుతున్నదేమిటో టీడీపీ దృష్టికి వచ్చింది. ఈ దుర్ఘటనల వెనుక వైసీపీ కుళ్లు కుతంత్రాలు ఉన్నాయని టీడీపీకి బోధపడింది.

మొదటి దుర్ఘటన సమయంలోనే ఒకరిద్దరూ టీడీపీ సీనియర్ నేతలు వైసీపీపై అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పుడు చంద్రబాబు లైట్ తీసుకున్నారు. రెండో ఘటన తర్వాతే విషయం ఆయనకు కూడా అర్థమైంది. పైగా అంతలోనే ఏమీ తెలియనట్లుగా వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 జారీ చేసిందని గ్రహించారు.

దానితో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. వైసీపీ బండారాన్ని బయటపెట్టేందుకు సిద్దమయ్యారు. కుప్పం మీటింగ్ వేదికగా వైసీపీ దుశ్చర్యలను ఎండగట్టారు. తమ మీటింగులను ఫెయిల్ చేయడానికి తమను బయటకు రాకుండా చూడటానికి కుట్రలు పన్నుతున్నారని ఆయన అన్నారు. ఆ కుట్రలో భాగమే కందుకూరు, గుంటూరు, తాజాగా కుప్పం సంఘటనలని ఆయన విశ్లేషించారు. తొక్కిసలాటలు వైసీపీ పుణ్యమేనని ఆయన నర్మగర్భంగా వెల్లడించారు. తనను, తన పార్టీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్నారన్నారు….

నారా లోకేష్ కూడా..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా.. వైసీపీపై ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. కోడికత్తి గాటు, బాబాయ్ గుండెపోటు డ్రామాల అనుభవంతో జగన్ తొక్కిసలాట స్కెచ్ వేశాడని లోకేష్ అన్నారు. ప్రశ్నించే ప్రతిపక్షం అంటే జగన్ కు వణుకని, సైకో పాలన పోవాలని ఉద్యమిస్తున్న టీడీపీకి ప్రజా మద్దతు వెల్లువెత్తుతుంటే చూడలేకపోతున్నారని ఆరోపించారు. చంద్రబాబు సభలు జనసంద్రాన్ని తలపిస్తుంటే తట్టుకోలేక తొక్కిసలాటను సృష్టించారని లోకేష్ ఆరోపించారు. దానితో ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోవడం వైసీపీ వంతయ్యింది..