సునీల్ దేవధర్.. ఏపీలో ఎందుకు ఫెయిలయ్యారు?

తెలంగాణలో తొడ కొడుతున్న బీజేపీ ఏపీలో మాత్రం నీరసంగా అడుగులు వేస్తోంది. అక్కడి నాయకుల్లోనే ఆ నీరసం ఉండగా వారిని నడిపించడానికి నియమించిన ఏపీ వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్ మరింత నీరసంగా మారి ఇటువైపు చూడడమే మానేశారు. ఇక సహాయ ఇంచార్జి సునీల్ దేవధర్ కూడా ఏపీ విషయంలో ఏమీ చేయలేకపోతున్నారు. ఇంకా చెప్పాలంటే సునీల్ దేవధర్‌కు ఇది ఫస్ట్ ఫెయిల్యూర్.

2018 జులైలో ఏపీ బీజేపీ వ్యవహారాల సహాయ ఇంచార్జిగా సునీల్ దేవధర్ నియమితులు కావడంతో ఇక ఏపీలో బీజేపీ పరుగులు తీస్తుందని అంతా భావించారు. కానీ మూడున్నరేళ్లయినా సునీల్ మార్క్ ఏమాత్రం కనిపించలేదు.

ఏపీ బాధ్యతలు తీసుకోవడానికి ముందు వరకు సునీల్ దేవధర్‌కు చాలా పెద్ద పేరుంది. ఇతర పార్టీల కంచుకోటల నుంచి కూడా బీజేపీకి ఓట్ల వర్షం కురిపించగల సమర్ధుడని ఆయనకు పేరుంది. ఏకంగా తనకు అప్పగించిన స్టేట్లో తిష్ఠవేసి.. అక్కడి తిండే అలవాటు చేసుకుని, అక్కడి భాషే నేర్చుకుని మరీ అదే మాట్లాడుతూ తన యాక్షన్ ప్లాన్ మొదలుపెడతాడు. కానీ, ఆ స్ట్రేటజీలేవీ ఏపీలో పనిచేయలేదు.

సునీల్ దేవధర్ పేరు త్రిపుర ఎన్నికలతో బాగా పాపులర్ అయింది. దశాబ్దాలుగా సీపీఎం పాలనలో ఉన్న త్రిపురలో అంతకుముందు బీజేపీ డిపాజిట్లు సాధిస్తేనే పెద్ద గొప్పలా ఉండేది. అలాంటిది.. ఏకంగా అక్కడ అధికారం కొల్లగొట్టేలా చేశారు సునీల్. 2013లో త్రిపురలో 50 చోట్ల బీజేపీ పోటీ చేస్తే ఒకే ఒక చోట డిపాజిట్ దక్కింది. కానీ…. 2014కి వచ్చేసరికి మొత్తం త్రిపుర బీజేపీ చేతుల్లోకి వచ్చేసింది. దీని వెనుక ఉణ్నది సునీల్. ఎన్నికలకు 500 రోజుల ముందు నుంచి త్రిపురలోనే తిష్ట వేశారాయన. అక్కడి ప్రజలు మాట్లాడే ప్రధాన భాషలతో పాటు గిరిజన భాషలూ నేర్చేసుకున్నారు. స్టెప్ బై స్టెప్ తన ప్లాన్ అమలు చేసి ఎవరూ ఊహించని రీతిలో బీజేపీకి అధికారం అందించారు.

అంతకుముందు కూడా అన్నీ అలాంటి టఫ్ టాస్క్‌లే. 2014లో మోదీ పోటీ చేసిన వారణాసి నియోజకవర్గానికి సునీలే ఇంఛార్జి . మహారాష్ట్రలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు తొలుత 32 నియోజకవర్గాల బాధ్యత అప్పగించారు. కానీ.. అమిత్ షా ఆ రాష్ట్రంలో పర్యటించినప్పుడు సునీల్ ను ఆ బాధ్యత నుంచి తప్పించి ఏజెన్సీ ప్రాంతమైన పాల్గఢ్ జిల్లాలోని దహానూ నియోజకవర్గంలో బీజేపీ గెలుపుకోసం పనిచేయాలని సూచించారు. మహారాష్ట్రంలో సీపీఎం చేతిలో ఉన్న ఏకైక నియోజకవర్గమది. ఆ ఎస్టీ నియోజకవర్గంలో అంతవరకు బీజేపీ ఎప్పుడూ గెలవలేదు. కాంగ్రెస్, కమ్యూనిస్టులే గెలుస్తూ వస్తున్నారు. అమిత్ షా సూచనతో అక్కడికి వెళ్లిన సునీల్ దహానూ నియోజకవర్గాన్ని బీజేపీ పరం చేయగలిగారు.

అంతకుముందు 2012లో గుజరాత్‌లో మోదీ మూడోసారి ముఖ్యమంత్రి పదవిని అందుకునే ప్రయత్నంలో జరుగుతున్న ఎన్నికలు. ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది.. ఎలాగైనా గెలవాలన్నది మోదీ లక్ష్యం. ఆ క్రమంలోనే దహోడ్ జిల్లాను సునీల్ కుఅప్పగించారు. అక్కడ ఆరు నియోజకవర్గాలుంటే కేవలం ఒక్కరే బీజేపీ ఎమ్మెల్యే, మిగతా అయిదుగురూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కానీ.. సునీల్ ఆ జిల్లాలో సీను మార్చేశారు. ఆరులో మూడు చోట్ల బీజేపీ అభ్యర్థులను గెలిపించారు.

ఇలాంటి స్ట్రాంగ్ ట్రాక్ రికార్డున్న సునీల్ దేవధర్‌ను ఏపీలో మాత్రం చతికిలపడ్డారు. ఏపీలో బీజేపీ క్యాడర్‌ను పెంచలేకపోయారు. నేతల మధ్య సమన్వయం సాధించలేకపోయారు. అంతేకాదు… సునీల్ దేవధర్ అనే వ్యక్తి ఏపీలో పనిచేస్తున్నట్లు ఎక్కడా ఫోకస్ కూడా కాలేకపోయారు. మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ సునీల్ ప్రాబల్యమే లేకుండా పోయింది.