మోదీ కేబినెట్లోకి సీఎం రమేశ్, బండి సంజయ్?

ఏపీ, తెలంగాణలో బీజేపీ నేతలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో కేంద్ర మంత్రివర్గాన్నివిస్తరిస్తారనే అంచనాలు వినిపిస్తున్న తరుణంలో ఏపీ నుంచి ఒకరికి.. తెలంగాణ నుంచి ఒకరికి మోదీ కేబినెట్లో చోటు దొరుకుతుందని దిల్లీ వర్గాలలో వినిపిస్తోంది.

ముఖ్యంగా 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో చేయాలనుకుంటున్న ఈ విస్తరణతో తెలుగు రాష్ట్రాలకూ ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. అదే జరిగితే తెలంగాణలో బండి సంజయ్‌కు మంత్రి పదవి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్లో ఉన్నారు. అదేసమయంలో తెలంగాణలో బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావులు కూడా లోక్ సభ సభ్యులుగా ఉన్నారు. లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు. వీరిలో సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సంజయ్ గత కొన్నేళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఢీకొంటున్నారు. అదేసమయంలో ధర్మపురి అరవింద్ కూడా కేసీఆర్ కుమార్తె కవితపై నిజామాబాద్‌లో విజయం సాధించారు. సంజయ్‌కు అవకాశాలు అధికంగా ఉన్నప్పటికీ అరవింద్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెప్తున్నారు.

ఇక ఏపీ విషయానికొస్తే బీజేపీకి లోక్ సభ సభ్యులు ఎవరూ లేకపోగా రాజ్యసభ మెంబర్లుగా సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావులు ఉన్నారు. ఇద్దరూ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు కొనసాగుతున్నారు. వీరిలో జీవీఎల్ మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తి అయినప్పటికీ తాజా రాజకీయ కారణాల రీత్యా సీఎం రమేశ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కేసీఆర్ తన బీఆర్ఎస్ పార్టీని విస్తరించే క్రమంలో ఏపీపై ఫోకస్ చేస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ తన సామాజికివర్గమైన వెలమలను పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీలో వెలమ సామాజికవర్గం నుంచి ఉన్న బలమైన నేత సీఎం రమేశ్. ఆ రకంగా సీఎం రమేశ్‌కు కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చి ఏపీలో ఆయన్ను యాక్టివ్‌గా మార్చాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక వీరెవరూ కాకుండా ఇంకెవరికైనా ఇవ్వాలనుకుంటే 6 నెలల్లో వారిని పార్లమెంటుకు పంపాల్సి ఉంటుంది. అందుకు ప్రస్తుతం అవకాశాలు తక్కువే. ఏపీలో పురంధేశ్వరి వంటివారు ప్రయత్నాలు చేస్తున్నా పార్లమెంటు సభ్యత్వమనేది ఆటంకంగా కనిపిస్తోంది. ఎంపీలుగా లేని సీనియర్లు ఎవరికైనా కేబినెట్లో బెర్తు ఇవ్వాలంటే అనంతరం రాజ్యసభకు పంపాల్సి ఉంటుంది. కానీ… 2023లో జులై చివర్లో ఒకటి… ఆగస్ట్ 18 నాటికి మరో 9 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. కానీ.. జనవరిలో మంత్రివర్గ విస్తరణ చేస్తే అప్పటికి 6 నెలలు పూర్తయిపోతుంది. జులై 28న గోవాలో ఒక సీటు ఖాళీ అవుతుంది.. అది బీజేపీ సభ్యుడు ఖాళీ చేస్తున్న స్థానమే. ఆపై ఆగస్టులో గుజరాత్‌లో 3, పశ్చిమబెంగాల్‌లో 6 ఖాళీ అవుతున్నాయి. గుజరాత్‌లో 3 స్థానాలలో ఒకటి ఎస్.జయశంకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. దాన్ని ఆయనకే మళ్లీ ఇవ్వనున్నారు. మిగతా రెండు సీట్లలోనూ గుజరాత్ నేతలకే అవకాశం ఉండనుంది.

పశ్చిమబెంగాల్‌లో ఖాళీ అవుతున్న 6లో 5 టీఎంసీ సీట్లు ఒకటి కాంగ్రెస్ సీట్. బెంగాల్‌లో బీజేపీ బలం పుంజుకోవడంతో ఈసారి 6లో 2 నుంచి 3 రాజ్యసభ సీట్లు బీజేపీకి వస్తాయి. కానీ.. అక్కడి నేతలకే అవకాశాలు ఇవ్వాలనుకుంటోంది బీజేపీ. వీటన్నిటి నేపథ్యంలో సీఎం రమేశ్, జీవీఎల్ కాకుండా వేరేవారికి అవకాశాలు లేవు.