ఏపీలో వ‌లంటీర్ల వేత‌నం 15 వేలు.. మంత్రి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వానికి అన్నీ తామై వ్య‌వ‌హ‌రిస్తున్న వ‌లంటీర్ల విష‌యంలో అమ‌లాపురం ఎమ్మెల్యే, మంత్రి పినిపే విశ్వ‌రూప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం వారికి ఇస్తున్న రూ.5000ల‌ను త్వ‌ర‌లోనే 15000కు పెంచుతామ‌ని ఆయ‌న చెప్పారు. అయితే.. దీనికి ఆయ‌న ఒక కండిష‌న్ పెట్టారు. ఆ కండిష‌న్‌ను వ‌లంటీర్లు నెర‌వేర్చితే.. ఖ‌చ్చితంగా వారి వేత‌నం మూడు రెట్లు అవుతుంద‌ని చెప్పారు.

ఇంత‌కీ ఆ కండిష‌న్ ఏంటంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీతో వైసీపీ ప్ర‌భుత్వాన్ని మ‌రోసారి ఏర్పాటు చేసేలా .. వ‌లంటీర్లు శ‌క్తి వంచ‌న లేకుండా ప‌నిచేయాల‌నేది ఆయ‌న చెప్పిన కండిష‌న్‌. “వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టికే వైనాట్ -175 నినాదం ఇచ్చారు. దీనికి అనుగుణంగా.. వ‌లంటీర్లు ప‌నిచేయాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ జెండానే క‌నిపించాలి. రెప‌రెప‌లాడించాలి. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. వైసీపీనే విజ‌యం ద‌క్కించుకోవాలి. అప్పుడు వలంటీర్ల‌కు 15వేల వేతనం చేస్తాం” అని చెప్పుకొచ్చారు.

వాస్త‌వానికి వ‌లంటీర్ల‌కు ఇప్పుడు రూ.5000 గౌర‌వ వేత‌నంగా ఇస్తున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌తి ఉగాది పండుగ రోజున వారికి గిఫ్టులు, బిరుదులు, స‌త్కారాలు చేస్తున్నారు. అయితే..పెరుగుత‌న్న ధ‌ర‌లు.. కుటుంబ బాధ్య‌త‌ల నేప‌థ్యంలో వ‌లంటీర్లు త‌మ వేత‌నాల‌ను పెంచాల‌ని ఎప్ప‌టి న‌నుంచో కోరుతున్నారు. ఈ క్ర‌మంలో ఒకానొక ద‌శ‌లో ఉద్య‌మం కూడా చేశారు. అయితే.. ప్ర‌భుత్వం వారికి పెంచేందుకు నిరాక‌రించింది. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా ఎన్నిక‌ల‌ను అడ్డు పెట్టుకుని వ‌లంటీర్ల‌కు తాయిలం ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.