ఏపీలో బీజేపీ సీనియర్లు పవన్ కల్యాణ్‌పై గట్టిగానే ఆశలు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. తమ సొంత బలం కంటే పవన్ బలంతో ఏపీని ఏలగలమని నమ్ముతున్నట్లుగా కనిపిస్తున్నారు. బీజేపీలో ఉండీ ఉండనట్లుగా ఉంటున్న కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల పవన్‌కు అండగా ఉంటానంటూ బహిరంగంగా మద్దతు ప్రకటించగా.. తాజాగా మరో నేత కూడా పవన్ పక్షం వహించారు. బీఆర్ఎస్ ఏపీలో కాపులను ఆకర్షిస్తూ పవన్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని, పవన్‌ను ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు.
బీఆర్ఎస్‌లో ఏపీకి చెందిన తోట చంద్రశేఖర్, ఇతర కొందరు కాపు నేతలు చేరడంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు స్పందించారు. బీఆర్ఎస్‌ను ఏపీలోకి స్వాగతించరాదని ఆయన కుండబద్ధలు కొట్టారు. రాష్ట్ర విభజనకు కారకుడు కేసీఆర్ అని… ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్‌పై చేసిన వ్యాఖ్యలు మర్చిపోలేమని అన్నారు.
ఏపీలో పవన్ కల్యాణ్‌ను దెబ్బకొట్టేందుకు కేసీఆర్, జగన్‌లు కలిసి కాపులతో రాజకీయం చేస్తున్నారని విష్ణుకుమార్ రాజు ఆగ్రహించారు. పవన్‌ను కంట్రోల్ చేయడం జగన్ వల్లే కాదు కేసీఆర్ వల్ల ఇంకేమవుతుందని ఆయన అన్నారు. కేసీఆర్ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌కు ఇలాంటి దుస్థితి వచ్చిందని.. ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఏపీపై విద్వేషం కక్కారని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు.
బీజేపీలో కీలక పదవుల్లో ఉన్నప్పటికీ చాలాకాలంగా సైలెంట్‌గా ఉంటున్న విష్ణుకుమార్ రాజు తాజాగా ఇలా పవన్‌కు మద్దతుగా మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకూ తీవ్రమవుతున్న తరుణంలో జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు రావడం ఖాయమని గట్టిగా నమ్ముతున్న బీజేపీ నేతల్లో విష్ణుకుమార్ రాజు కూడా ఒకరు. అయితే, ఇలాంటి అనుకూల పరిస్థితులను చెడగొట్టడానికి కేసీఆర్ సాయంతో జగన్ రాజకీయం చేస్తున్నారన్నది ఆయన ఆరోపణ. జాతీయ పార్టీగా ఎదగాలని కలలు కంటున్న బీఆర్ఎస్ ఏపీలో మాత్రం జగన్ పార్టీతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ పవన్ అవకాశాలు పోగొట్టే ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపనలు బలంగా వినిపిస్తున్నాయి.