ఉయ్యూరు నాకు మంచి మిత్రుడు వైసీపీ ఎమ్మెల్యే సంచ‌న‌ల వ్యాఖ్య‌లు

ఇటీవ‌ల గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ అనే సంస్థ పేద‌ల‌కు చంద్ర‌న్న సంక్రాంతి కానుక‌లు, జ‌న‌తా వ‌స్త్రాల పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తొక్కిస‌లాట జ‌రిగి.. ముగ్గురు మ‌హిళ‌లు చ‌నిపోయారు. అదేస‌మ‌యంలో మ‌రికొంద‌రు కూడా గాయ‌ప‌డ్డారు. అయితే.. ఈ విష‌యంపై రాజ‌కీయ దుమారం రేగింది. వైసీపీ నేత‌లు.. చంద్ర‌బాబు, టీడీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇక‌, పోలీసులు కేసు కూడా న‌మోదు చేశారు. ఉయ్యూరు ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కులు, ఎన్నారై.. ఉయ్యూరు శ్రీనివాస‌రావుపై పోలీసులు కేసు కూడా పెట్టారు. అయితే.. కోర్టు ఆయ‌న‌ను జైలుకు త‌ర‌లించేందుకు నిరా క‌రించింది. ఇదిలావుంటే.. ఈ విష‌యంపై ఇరు పార్టీలు ఘ‌ర్ష‌ణ‌కు దిగిన నేప‌థ్యంలో వైసీపీ నేత‌, మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

గుంటూరు ఘటనను చిలువలు పలువలు చేసి మాట్లాడడం సరికాదు. ఉయ్యూరు శ్రీనివాస్ నాకు మంచి మిత్రుడు, ప్రవాసాంధ్రుల వలన దేశానికి మంచి జరుగుతుంది. శ్రీనివాస్ పేదల పట్ల అభిమానం ఉన్న వ్యక్తి. ప్రజలకు నష్టం జరగాలని ఇలాంటి కార్యక్రమాన్ని చేయరు. టీడీపీతో కలిసి కార్యక్రమం చేశారు కాబట్టి శ్రీనివాస్ పై ఇలా వివాదాలు ముసురుకుంటున్నాయి. సేవా కార్యక్రమాలు చేయడం మంచిపని, ఇలా ప్రవర్తిస్తే భవిష్యత్ లో ప్రవాసాంధ్రుల మనకి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకి రారు అని వ్యాఖ్యానించారు.

వాస్త‌వానికి ఇత‌ర రాజ‌కీయ‌వ‌ర్గాల నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్త‌మ‌వుతోంది. ఇక‌, ఇప్పుడు సొంత పార్టీ నాయ‌కులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.