ఏపీలో ఈ రోజు క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు ఎన్నో తెలుసా?


ఒక్క రోజులో వెయ్యి క‌రోనా కేసుల‌ట‌. గ‌త నెల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబంధించి ఈ అప్ డేట్ చూసి వామ్మో వాయ్యో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా ఏపీలో ఒక్క రోజులో 5 వేల కేసుల‌కు పైగా వ‌చ్చాయంటే క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయంటే తీవ్ర‌త ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఒక్క రోజు వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో ఏకంగా 56 మంది ప్రాణాలు కోల్పోవ‌డం మ‌రింత ఆందోళ‌న క‌లిగించే విష‌యం.

తెలంగాణ‌లో క‌రోనా బులిటెన్ రోజూ రాత్రి ఇస్తే.. ఏపీలో ఉద‌య‌మే బులిటెన్ రిలీజ్ చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. కానీ ఆదివారం మాత్రం మార్పు చోటు చేసుకుంది. సాయంత్రం దాకా బులిటెన్ ఇవ్వ‌లేదు. దీంతో ఉత్కంఠ నెల‌కొంది. చివ‌రికి రాత్రి 7 గంట‌ల‌కు బులిటెన్ రిలీజ్ చేశారు. అందులో క‌రోనా కేసుల గ‌ణాంకాలు చూసి అంతా షాకైపోయారు.

గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో ఏకంగా 5041 కొత్త క‌రోనా కేసులు బ‌య‌ట ప‌డిన‌ట్లు ఇందులో వెల్ల‌డించారు. కాక‌పోతే టెస్టుల సంఖ్య కూడా ఎక్కువ‌గానే ఉండ‌టం కొంచెం ఉప‌శ‌మ‌నం క‌లిగించే విష‌యం. 31 వేల‌కు పైగా శాంపిల్స్ తీస్తే అందులో 5041 మందికి క‌రోనా ఉన్న‌ట్లు వెల్ల‌డైంది. అలా చూసినా 20 శాతం దాకా పాజిటివ్ రేటు ఉండ‌టం ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మే.

శ‌నివారం 4 వేల మార్కుకు ద‌గ్గ‌ర క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఒక్క తూర్పుగోదావ‌రిలోనే 1000కి చేరువగా కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. ఆదివారం ఆ జిల్లాలో 647 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఆ ఒక్క జిల్లాలోనే 10 మంది మ‌ర‌ణించారు. శ్రీకాకుళంలో ఎనిమిది మంది.. విశాఖ‌ప‌ట్నం, క‌ర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఏడుగురి చొప్పున ప్రాణాలు వ‌దిలారు. సౌత్ ఇండియాలో ఒక్క రోజులో 5 వేల కేసులు న‌మోదైన తొలి రాష్ట్రం ఏపీనే కావ‌డం గ‌మ‌నార్హం