తేల‌ని రాజ‌ధాని.. ఏపీకి నిరాశ మిగిల్చిన 2022

కీల‌క‌మైన రాజ‌ధాని విష‌యంలో ఏపీ ప్ర‌జ‌ల‌కు 2022 తీవ్ర నిరాశ‌నే మిగిల్చింద‌ని చెప్పాలి. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని ఒక‌వైపు రైతులు ఉద్య‌మాన్ని తీవ్ర త‌రం చేశారు. మ‌లివిడ‌త పాద‌యాత్ర‌కు రెడీ అయ్యారు. ఈ సారి అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వ‌హించేందుకు ఉద్యుక్తుల‌య్యారు. అయితే.. య‌థాప్ర‌కారం పోలీసులు వారికి అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించి అనుమ‌తి పొందిన రైతులు.. పాద‌యాత్ర‌ను కొన‌సాగించారు. అయితే.. ఇది తూర్పు గోదావ‌రికి చేరుకునే స‌రికి అనేక నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

పాద‌యాత్ర‌కు ప్ర‌తిగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగిపోయి.. ఉత్త‌రాంధ్ర గ‌ర్జ‌న పేరిట విశాఖ‌లో మార్చ్ నిర్వ‌హించారు. స‌భ పెట్టారు. అంతేకాదు.. పాద‌యాత్ర‌ను అడ్డుకుంటామ‌ని మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ మీడియా ముందుకు వ‌చ్చి ప్ర‌క‌టించారు. ఆయ‌న ఆమాట చెప్పిన మ‌రుక్ష‌ణ‌మే రాజ‌మండ్రిలో పాద‌యాత్ర చేస్తున్న రైతుల‌పై ఎంపీ మార్గాని భ‌ర‌త్ వ‌ర్గీయులు నీళ్ల సీసాల‌తో దాడులు చేశారు. అంతేకాదు.. ఈ ఘ‌ట‌నలో ఏకంగా ఎంపీనే పాల్గొన్నారు. ఇంకోవైపు. పోలీసులు పాద‌యాత్ర పై ఉక్కుపాదం మోపారు. దీంతో పాద‌యాత్ర‌ను మ‌ధ్య‌లో ఆపేసి.. న్యాయ‌స్థానం మెట్టెక్కారు అన్న‌దాత‌లు.

ఇక్క‌డ వీరికి అనుకూలంగా తీర్పు వ‌చ్చినా.. ఐడీ కార్డుల పేరుతో పోలీసులు మ‌రోసారి వేధించార‌ని రైతులు పేర్కొన్నారు. మొత్తానికి వైసీపీ నాయ‌కుల పంత‌మే ఈ విష‌యంలో నెగ్గింద‌ని చెప్పాలి. ఇదిలావుంటే హైకోర్టు మూడు రాజ‌ధానులు కుద‌ర‌వ‌ని.. కేంద్రం చేసిన ఒక రాజ‌ధాని చ‌ట్టాన్ని మార్చేందుకు రాష్ట్రానికి హ‌క్కులేద‌ని.. ఆరు మాసాల్లో రైతుల‌కు భూముల‌ను డెవ‌ల‌ప్ చేసి ఇవ్వాల‌ని.. మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాల‌ని సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. అయితే.. ప్ర‌భుత్వం ఈ తీర్పును ప‌క్కన పెట్టి చివ‌రి నిముషంలో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

దీనిపై సుప్రీంకోర్టు ఎటూ తేల్చ‌కుండా.. దీనినిలోతుగా విచారించాల్సి ఉంద‌ని పేర్కొంటూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఇదే స‌మ‌యంలో మూడు రాజ‌ధానుల‌కు కూడా సుప్రీం కోర్టు అనుకూలంగా తీర్పు చెప్ప‌లేదు. ఇదిలావుంటే.. విశాఖ‌ను పాల‌నా రాజ‌ధాని చేయాల‌న్న వైసీపీ నేత‌ల డిమాండ్లు చ‌ల్ల‌బ‌డ‌గా.. రైతులు.. కేంద్రం వ‌ర‌కు త‌మ పోరును కొన‌సాగించారు. దాదాపు 1600 మంది రైతులు.. శీతాకాల పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఢిల్లీ చేరుకుని.. జాతీయ పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. మోడీ శంకుస్థాప‌న చేసిన రాజ‌ధానిని ముందుకు తీసుకువెళ్లాల‌ని అభ్య‌ర్థించారు. అయితే.. కేంద్రం దీనిపై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఫ‌లితంగా.. 2022లో ఏపీ రాజ‌ధాని అంశం.. కొన్ని ఉద్రిక్త‌త‌ల‌కు, మ‌రికొన్ని వివాదాల‌కు.. మాత్ర‌మే ప‌రిమితమైంద‌ని చెప్పాలి.