ఏపీలో అధికారంలోకి వచ్చితీరుతామని పదే పదే చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు.. 2022 ఏం మిగిల్చింది? ఏం ఇచ్చింది? అనే విషయాలను చూస్తే.. రిక్తహస్తాలు.. శుష్క ప్రయత్నాలు అనే చెప్పాల్సి ఉంటుంది. జూన్‌లో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఆవేశ పూరితంగా చేసిన కొన్ని విషయాలను ఆయనే మరిచిపోయారనే వాదన బలంగా వినిపించింది. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెస్తానని పవన్ చెప్పారు. వైసీపీ ఓటు బ్యాంకును చీలనివ్వనని పదే పదే చెబుతూనే ఉన్నారు. కానీ, దీనికి సంబంధించి.. బీజేపీ పెద్దలు రోడ్ మ్యాప్ ఇవ్వాలని సంచలన ప్రకటన చేశారు.
తర్వాత కాలంలో సుదీర్ఘ విరామం ఇచ్చిన పవన్.. మళ్లీ మంగళగిరి మండలంలోని ఇప్పటంలో తన పార్టీ ఆవిర్భావ సభకు భూములు ఇచ్చిన రైతుల ఇళ్లను తొలగిస్తున్నారని పేర్కొంటూ.. వచ్చి హల్చల్ చేశారు. ఈ క్రమంలో రాజకీయం వేడెక్కింది. అయితే.. హైకోర్టులో ఈ రైతులు దాఖలు చేసిన అఫిడవిట్లు తదనంతర పరిణామాలతో జనసేనకు సెగ తప్పలేదు. అయితే.. ఇచ్చిన మాట ప్రకారం బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆయన అందించారు. ఇక, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవడం.. జనసేనలో కొంత ఊపు తెచ్చింది.
ఆత్మహత్య చేసుకున్న రైతుకు చెందిన ప్రతి కుటుంబాన్ని పరామర్శించి.. వారి కుటుంబాలకు సాయం చేశారు. అయితే.. ఇది ఊపు తెచ్చినా..అనుకున్న విధంగా పార్టీకి మైలేజీ ఇవ్వలేక పోయింది. దీనికి కారణం.. విడతల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం.. గ్యాప్‌లపై గ్యాప్ ఇవ్వడం. మరోవైపు.. వైసీపీ అధినేత సీఎం జగన్‌పై.. విమర్శలు, వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు.. కొంత మేరకు పండాయని చెప్పుకోవచ్చు. అయితే.. పార్టీ పరంగా చూసుకుంటే.. సుదీర్ఘ రాజకీయ ప్రస్తానం ఉందని చెప్పిన పవన్.. చుక్కాని లేని నావలానే తన పార్టీని ముందుకు నడిపించారనేది పచ్చినిజం.
కేడర్ లేదు. క్షేత్రస్థాయిలో నాయకులు లేరు. పైగా పొత్తు ఉంటుందని అంటారు. కానీ, క్లారిటీ లేదు. మరోవైపు పొత్తులో ఉన్న బీజేపీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం జరిగినా.. దానిపై పన్నెత్తు మాట కూడా చెప్పలేకపోయారు. దీంతో జనసేనలో చేరాలని ఉవ్విళ్లూరిన అనేక మంది పార్టీకి దూరంగా ఉండిపోయారు. పవన్ వస్తే.. పండగ, లేకుంటే దండగ
అనే నినాదం జోరుగా వినిపించింది. మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోడీతో విశాఖలో భేటీ తర్వాత.. ముందు.. పవన్ తీవ్ర వత్తిడి ఎదుర్కొన్నారనేది కూడా వాస్తవం.
అయితే.. జనసేనకు సంబంధించి ఈ ఏడాది జరిగిన రెండు కీలక పరిణామాలను చర్చించుకోవాలి. ఒకటి మెగా కుటుంబం ఈ ఏడాది పవన్‌కు అండగా ఉంటామని ప్రకటించింది. మెగా అభిమానులు విజయవాడలో సభను ఏర్పాటు చేసి.. మరీ వచ్చే ఎన్నికల్లో పవన్‌కు అండగా నిలవాలని తీర్మానం చేశారు. అదేసమయంలో మెగా స్టార్ చిరంజీవి సైతం.. తన తమ్ముడు.. భవిష్యత్తులో ముఖ్యమైన హోదాలో ఉండబోతాడు.. అంటూ.. సీఎం అవుతాడనే అర్ధంలో మాట్లాడి.. జనసేన లో జోష్ పెంచారు.
2022 జనసేనకు ఇచ్చింది: కొంత ఊపు!
2022 జనసేనకు మిగిల్చింది: చుక్కాని లేనినావ అనే అపవాదు!