విధేయుడికి వీర‌తాడు.. సునీల్ కు ప్ర‌మోష‌న్ ఇచ్చిన జ‌గ‌న్‌!

త‌న‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించేవారిని అంద‌లం ఎక్కిస్తున్న సీఎం జ‌గ‌న్‌.. తాజాగా వీర విధేయుడిగా పేరు పొందిన ఐపీఎస్ అధికారి, ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన సునీల్ కుమార్‌కు ప్ర‌మోష‌న్ ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న సీఐడీ అద‌న‌పు డీజీపీగా ఉన్నారు. అయితే, ఇక నుంచి ఆయ‌న పూర్తిస్థాయి డీజీపీగా ఇదే విభాగంలో ప‌నిచేయ‌నున్నారు. దీంతో అధికారాల‌తోపాటు.. వేతనం, ఇత‌ర అల‌వెన్సులు ల‌భించ‌నున్నాయి.

అయితే.. సీఐడీ అధికారి సునీల్ కుమార్‌.. చుట్టూ అనేక వివాదాలు ముసురుకున్నాయి. ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత‌లు ఆయ‌న‌పై ఇప్ప‌టికే అనేక విష‌యాల్లో హైకోర్టులో ప్రైవేటు కేసులు దాఖ‌లు చేశారు. ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించిన వారికి హైకోర్టు ఆదేశాల మేర‌కు 41ఏ కింద ముంద‌స్తు నోటీసులు ఇచ్చి.. వారి నుంచివివ‌ర‌ణ తీసుకున్న అనంత‌ర‌మే అరెస్టు చేయాల‌ని.. లేదా ప్ర‌శ్నించాల‌ని.. కోర్టు స్ప‌ష్టం చేసింది.

అయితే.. ఈ తీర్పును ప‌క్కన పెట్టి పాల‌కుల మెప్పుకోసం.. సునీల్ ప‌నిచేస్తున్నార‌ని టీడీపీ నేత‌లు ఆరోపి స్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండానే, అర్ధ‌రాత్రి, అప‌రాత్రి అనే తేడా లేకుండా.. విమ‌ర్శించిన వారిని అరెస్టు చేయ‌డం, దూషించ‌డం చేస్తున్నార‌ని టీడీపీ నాయ‌కులు సునీల్‌పై బ‌హిరంగ విమ‌ర్శ‌లే చేశారు. ఈ క్ర‌మంలోనే వ‌ర్ల రామ‌య్య వంటివారు ఆయ‌న‌పై కేసులు కూడా న‌మోదు చేశారు.

మ‌రోవైపు.. వైసీపీ అసంతృప్తి ఎంపీ.. రెబ‌ల్ ఎంపీగా పేరు ప‌డిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. అయితే.. సునీల్‌పై చేయ‌ని ఆరోప‌ణ లేదు. సీఎం క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేస్తున్నార‌ని.. సీఎం క‌ళ్ల‌లో ఆనందం చూడ‌డ‌మే సీఐడీ అధికారిగా సునీల్ బాధ్య‌త, విధి అని ఆయ‌న అనేక సంద‌ర్భాల్లో విమ‌ర్శించారు. త‌న‌ను హైద‌రాబాద్ నుంచి విజ‌యవాడ తీసుకువెళ్లి అరికాళ్ల‌పై లాఠీల‌తో కుళ్ల‌బొడిచి.. దానిని సీఐడీ సునీల్ ప్ర‌త్యక్ష ప్ర‌సారంలో సీఎం జ‌గ‌న్‌కు చూపించార‌ని.. కూడా ఆయ‌న ఆరోపించారు.

ఇప్పుడు సీఐడీ సునీల్‌కు ఇచ్చిన ప్ర‌మోష‌న్‌పై టీడీపీ నేత‌లుస్పందిస్తూ.. విధేయుడికి జ‌గ‌న్ భ‌లే వీర‌తాడు వేశాడులే అని అంటున్నారు. కాగా, ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన ఈ కీల‌క ప్ర‌మోష‌న్‌కు ఎన‌లేని ప్రాధాన్యం కూడా పెరిగిపోయింద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఉద్దేశ పూర్వంగానే సునీల్‌కు ప్ర‌మోష‌న్ క‌ల్పించార‌ని.. ప్ర‌తిప‌క్షాల‌ను క‌ట్ట‌డి చేయ‌డ‌మే దీనివెనుక ఉన్న ల‌క్ష్య‌మ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.