ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానిని అంగీకరించేది లేదని.. ఎట్టి పరిస్థితిలో దీనికి తాము ఒప్పుకోబోమని ఆయన వ్యాఖ్యానించారు. “అమరావతినే రాజధాని చేయాలని ఏ పార్టీ అయినా.. అనుకుంటే.. విశాఖను చిన్న రాష్ట్రం చేసి మాకు ఇచ్చేయండి.. మా పాలనేదో మేమే చేసుకుంటాం.. మా బతుకులేవో మేమే బతుకుతాం! రాజధాని కోసం మా కష్టార్జితాన్ని కట్టాల్సిన అవసరం లేదు. పన్నుల రూపంలో దోచుకుని.. ఒక్కచోటే పోగేసి.. మాకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోం“ అని తీవ్రస్తాయిలో హెచ్చరించారు.
ప్రపంచ దేశాలన్నీ వికేంద్రీకరణ కోరుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే విధానాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అనుసరిస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పొన్నాడ నుంచి బొంతలకోడూరు మీదుగా పాతదిబ్బలపాలెం వరకు రూ.4.98 కోట్ల పీఎంసడక్ యోజన- ఫేజ్ 3 నిధులతో నూతనంగా నిర్మించిన రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ తప్పనిసరిగా రాజధాని కావల్సిందేనని అన్నారు.
లేనిపక్షంలో విశాఖను కొత్త రాష్ట్రంగానైనా ప్రకటించాలన్నారు. హైదరాబాద్ రాజధాని కోసం 65 ఏళ్లపాటు రాష్ట్ర ఆదాయం మొత్తం వెచ్చించామన్నారు. ఇదే పొరపాటు పునరావృతమైతే మరో 70 ఏళ్లు వెనుకబాటు తప్పదన్నారు. ఈ ప్రాంత ప్రజలంతా పార్టీలకు అతీతంగా విశాఖ రాజధానికి మద్దతు తెలిపాలన్నారు. బాదుడే బాదుడు, ఇదేమి ఖర్మ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మతి భ్రమించిన మాటలతో రాష్ట్రంలో పర్యటిస్తున్నారని విమర్శించారు.
పెట్రో ధరలు, గ్యాస్, వంట నూనె తదితర ధరల పెంపు కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్న విషయాన్ని తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని టీడీపీ నేతలు ప్రయత్నించడం వారి అవివేకమన్నారు. కార్యక్రమంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖరరావు, ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.