వైసీపీ ఎమ్మెల్యేను ప్ర‌శ్నించారు.. చివ‌ర‌కు త‌న్నులు తిన్నారు!

వైసీపీ నేత‌లంటే నేత‌లే. ముఖ్యంగా సీమ ప్రాంత నేత‌లైతే.. మ‌రింత ఘాటు! వారిని ఎవ‌రూ ప్ర‌శ్నించ కూడ‌దు. ప్ర‌శ్నిస్తే.. ఇంత‌కు ముందు తిట్ల‌వ‌రకే ప‌రిమితం అయ్యారు. ఇప్పుడు ఎన్నిక‌లు ముంచుకు వ‌స్తున్న వేళ వారిలోనూ ఆవేశం, ఆగ్ర‌హం.. అన్నీ త‌రుముకొస్తున్నాయి. దీంతో ఏకంగా చేయిచేసుకుంటు న్నారు. చిత‌క్కొట్టేస్తున్నారు వారి అనుచ‌రుల‌తో కొట్టిస్తున్నారు కూడా!

రాజోలి జలాశయం భూసేకరణ పరిహారంపై ప్రశ్నించిన రైతులపై జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే త‌న అనుచరులతో దాడి చేయించ‌డంపై విమర్శలువ‌స్తున్నాయి. మూడేళ్లుగా నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతన్నలు జలాశయం సామర్థ్యం తగ్గిస్తామనే కలెక్టర్ మాటలతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే మాటను అధికార పార్టీ ఎమ్మెల్యేతో ప్రశ్నించగా వైసీపీ వర్గీయులు రెచ్చిపోయి రైతులపై దాడి చేశారు.

క‌డ‌ప జిల్లా రాజోలి జలాశయం భూసేకరణ పరిహారం కోసం కలెక్టర్‌ విజయరామరాజుతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, భూములిచ్చిన రైతులు కడప కలెక్టరేట్‌కు వెళ్లారు. జలాశయం సామర్థ్యం 2.95టీఎంసీలు కాకుండా 1.2 టీఎంసీలతోనే నిర్మించాలని ప్రభుత్వ ఆలోచన చేస్తోందని కలెక్టర్ తెలిపారు. దాంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని నిలదీశారు.

2.95 టీఎంసీలతో జలాశయం నిర్మిస్తేనే భూములిస్తామని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం చేయలేని ఎమ్మెల్యే కలెక్టర్‌ వద్దకు వచ్చి ఏం లాభమని అసహనం వ్యక్తం చేశారు. దాంతో ఎమ్మెల్యే క‌నుసైగ‌తో ఆయ‌న‌ అనుచరులు ఆగ్రహంతో ఊగిపోతూ రైతులపై చేయి చేసుకున్నారు. ఇరువురి మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

2008 డిసెంబరు 24న నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కడపజిల్లా పెద్దముడియం మండలంలోని రాజోలి జలాశయానికి శంకుస్థాపన చేశారు. వివిధ కారణాలతో పనులు మాత్రం ముందుకు సాగలేదు. 2019 డిసెంబరు 23న సీఎం జగన్ 13 వందల 57 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2.95 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మాణానికి మళ్లీ శంకుస్థాపన చేశారు.

మూడేళ్లవుతున్నా పనులు మొద‌లు కాక‌పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 9 వేల ఎకరాలు ముంపునకు గురవుతాయని అంచనా వేయగా వాటిలో రైతుల భూములు 7 వేల ఎకరాల వరకూ ఉన్నాయి. ఎకరాకు 12 లక్షల 50 వేలు ఇచ్చేందుకు రైతులతో ఒప్పందం జరగ్గా ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. ఇదే విష‌యాన్ని అడిగితే ఏకంగా కొట్ట‌డం గ‌మ‌నార్హం.