ఏపీలో ఉద్యోగులను అన్ని విధాలా వేధిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ప్రభుత్వం తాజాగా మరో సంచలన ఆదేశం జారీ చేసింది. ఉద్యోగులు ఎవరూ కూడా విధులకు వచ్చే సమయంలో తమ వద్ద రూ.500 నుంచి రూ.1000 కి మించి నగదును ఉంచుకోవడానికి వీల్లేదని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ఇది ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లోనే ఉంది. అయితే.. ఏ ప్రభుత్వం కూడా ఇలా ఎప్పుడూ ఆదేశించ లేదు. ఎందుకంటే.. ఎప్పుడు ఏ అవసరం ముంచుకు వస్తుందో తెలియదు కాబట్టి.. ఇలాంటి నిర్ణయాలను చూసీ చూడనట్టు వదిలేస్తుంటాయి.
కానీ, ఘనత వహించిన జగన్ సర్కారు మాత్రం రూల్స్ ప్రకారమే తాము పనిచేస్తున్నట్టుగా ఉద్యోగులకు రూల్స్ గుర్తు చేసింది. ఎవరూ కూడా రూ.500-1000కి మించి తీసుకురావద్దని తాజాగా సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సివిల్ సర్వీస్ రూల్స్ 1964 ప్రకారం.. దీనిలో సబ్ రూల్ 8(ఏ), 8(బీ), మరో సబ్ రూల్ 9 ప్రకారం.. ఎవరూ కూడా తమ వద్ద అధికంగా నగదు ఉంచుకోరాదని ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు ఉద్యోగులను మరింత మంటెత్తిస్తున్నాయి.
(8)(ఏ) అంటే..
ప్రభుత్వ సేవకుడు తన వద్ద ఉన్న నగదు ఖాతాను ఏ సమయంలోనైనా అందించవలసి ఉంటుంది. అటువంటి ఖాతాలో నగదు లభ్యత వివరాలను ప్రభుత్వం తెలుసుకుంటుంది.
(8) (B) అంటే..
సాధారణ లేదా ప్రత్యేక ఉత్తర్వు ద్వారా విధిలో ఉన్న ప్రభుత్వోద్యోగిని నిర్దేశిత మొత్తానికి మించి తన వద్ద నగదును ఉంచుకోవద్దని,అతని వద్ద ఉన్న నగదును ప్రకటించాలని కోరవచ్చు. రూ.500/- కంటే ఎక్కువ ఉంటే డ్యూటీకి రిపోర్టింగ్ సమయంలో వ్యక్తిగత నగదు డిక్లరేషన్ ఇవ్వాలి. అయితే.. పర్యటనలో(కార్యాలయంలో కాకుండా) పర్యటనలో ఉన్నప్పుడు రూ.10,000/- కంటే ఎక్కువ ఉంటే నగదు ఉంచుకోవచ్చు.
డైరెక్టర్ జనరల్, యాంటీ కరప్షన్ బ్యూరో, కార్యాలయంలో విధుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు వ్యక్తిగత నగదును కలిగి ఉండేందుకు గల సీలింగ్ పరిమితిని రూ.500/- నుండి రూ.1000కి పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని సర్కారు తెలిపింది.
ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఇప్పుడు డిజిటల్ చెల్లింపు యాప్‌లు సాధారణంగా ఉపయోగించబడు తున్నాయని, ఎక్కువ నగదును ఉంచుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ప్రకారం, పన్ను వసూలు చేసే విభాగాలతో సహా నగదుతో వ్యవహరించే అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులందరూ విధి నిర్వహణలో రిపోర్టింగ్ సమయంలో వ్యక్తిగత నగదు రూ.1000/ కంటే ఎక్కువగా ఉంటే డిక్లరేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates