లోకేష్ పాద‌యాత్ర‌కు బ్రేకిస్తే.. మ‌న‌కే తంటా.. వైసీపీ గుస‌గుస‌

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ జ‌న‌వ‌రి 27 నుంచి పాద‌యాత్ర చేయ‌నున్న‌ట్టు ప్ర‌క టించారు. యువ‌గ‌ళం పేరుతో ఆయ‌న పాద‌యాత్రకు రెడీ అవుతున్నారు దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుద‌ల చేశారు. అదేస‌మ‌యంలో ప‌తాకాన్ని కూడా ఆవిష్క‌రించారు. మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలోమీట‌ర్ల దూరాన్ని న‌డ‌వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇక‌, రూట్ మ్యాప్ మాత్రం సిద్ధం కావాల్సి ఉంది. అయితే.. ఇంత‌లోనే.. వైసీపీ మంత్రి మేరుగ నాగార్జున సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. లోకేష్ ఏ ఉద్దేశంతో పాద‌యాత్ర చేస్తున్నార‌ని.. ఆయ‌న ప్ర‌శ్నించారు. అంతే కాదు.. లోకేష్ పాద‌యాత్ర‌ను ఆపేస్తామ‌ని చెప్పారు. “గ‌తంలో రైతుల పాద‌యాత్ర ఆపేశాం. ఇప్పుడు లోకేష్ వంతు వ‌చ్చింది. దీనిని కూడా ఆపేస్తాం” అని ప్ర‌క‌ట‌న ఇచ్చారు.

అయితే, దీనిపై టీడీపీ నేత‌లు ఇంకా రియాక్ట్ కాలేదు. ఈలోగా నెల్లూరు జిల్లా కందుకూరు ఘ‌ట‌న జ‌రిగింది. దీంతో నాగార్జున వ్యాఖ్య‌లపై టీడీపీ నేత‌లు స్పందించ‌లేదు. కానీ, మంత్రిగారి వ్యాఖ్య‌ల‌పై సొంత పార్టీలోనే భిన్న‌మైన వాద‌న వినిపిస్తోంది. ఇది స‌రికాద‌ని.. దీనివ‌ల్ల మ‌న‌కే న‌ష్ట‌మ‌ని.. గుంటూరుకు చెందిన ఒక నేత ఆఫ్‌దిరికార్డుగా వ్యాఖ్యానించారు. గ‌తంలో జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తా వించారు.

అంతేకాదు.. “పాద‌యాత్ర‌ను అడ్డుకుంటే ఏమొస్తుంది? అప‌వాదు త‌ప్ప‌. గ‌తంలో మా నాయ‌కుడు కూడా పాద‌యాత్ర చేశారు. అప్పుడు ఇలానే అడ్డుకుని ఉంటే.. బాగుండేదా? ఇలాంటి ఆలోచ‌న‌లు స‌రికాదు. ఇలా చేస్తే.. టీడీపీకి మ‌రింత ప్ర‌చారం క‌ల్పించిన‌ట్టు అవుతుంది. వాళ్లు కోర్టుకు వెళ్తారు. అప్పుడు ఏం చేస్తారు. అది బాగుటుందా.? ప్ర‌భుత్వం పై మ‌చ్చ‌ప‌డ‌దా?” అని ఆయ‌న వ్యాఖ్యానించారు.